తెలంగాణ చెరువుల వద్ద కోలాహలం...జాలరిగా మారి చేపలు పట్టిన మంత్రి ఎర్రబెల్లి (వీడియో)

By Arun Kumar PFirst Published Jun 8, 2023, 4:34 PM IST
Highlights

మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చెరువులో దిగి జాలర్లతో కలిసి చేపలుపడితే... మరో మంత్రి నిరంజన్ రెడ్డి చేపల రుచి చూసారు. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోంది కేసీఆర్ సర్కార్. ఇందులో భాగంగానే ఇవాళ గ్రామగ్రామాన చెరువుల పండగ నిర్వహిస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల రూపరేఖలు ఎలా మారాయో ప్రజలకు చూపించేందుకు కేసీఆర్ సర్కార్ ఈ చెరువుల పండగ చేపట్టింది. దీంతో చెరువల వద్ద ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజలతో పాటు తమ గ్రామాల్లోని చెరువుల పునరుద్దరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి ఆర్థికసాయం చేసిన దాతలు సందడి చేసారు. చెరువు కట్టల వద్ద మైసమ్మకు పూజలు చేసి బోనాలు, బతుకమ్మతో ప్రజలు పండగ చేసుకున్నారు.   

పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో జరిగిన ఈ చెరువుల పండగ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొన్నారు. ప్రజలతో కలిసి గంగమ్మ, కట్టమైసమ్మ తల్లులకు పూజలు చేసారు మంత్రి. అనంతరం ప్రభుత్వం ఏర్పాటుచేసిన విందులో పాల్గొని ప్రజలతో కలసి భోంచేసారు. 

వీడియో

ఇలా పెద్దవంగర మండలం గంట్లకుంట గ్రామ సమీపంలో చెరువులో దిగిన మంత్రి ఎర్రబెల్లి మత్స్యకారులతో కలిసి చేపలు పట్టారు.ప్యాంటును పైకి లాగి చేరువు నీటిలో దిగిన మంత్రి వల చేతబట్టి చేపల వేటకు సిద్దమయ్యారు. ఇలా కొద్దిసేపు జాలరిగా మారి మంత్రి ఎర్రబెల్లి సరదాగా చేపలు పట్టారు. 

ఇదిలావుంటే తెలంగాణ దశాబ్ది అవతరణ ఉత్సవాలలో భాగంగా వనపర్తి పట్టణంలోని బాలకిష్డయ్య మైదానంలో మత్స్య శాఖ ఏర్పాటుచేసిన ఫిష్ ఫెస్టివల్ ను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  కాలంతో సంబంధం లేకుండా తెలంగాణలో చెరువులు నిండుగా నీటితో కళకళలాడుతున్నాయని అన్నారు. ప్రతి గ్రామంలోని చెరువు కృష్ణా నీళ్లతో నిత్యం నిండుగా వుంటోందన్నారు. దీంతో రాష్ట్రంలో చేపలు సమృద్దిగా లభిస్తున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 

గతంలో  శ్రీశైలం రిజర్వాయర్ లో పట్టిన చేపలను కొందరు జాలర్లు వనపర్తికి తీసుకువచ్చి అమ్మేవారని మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తుచేసారు. కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిషన్ కాకతీయతో చెరువులన్నింటిని బాగుచేసామని... దీంతో చెరువుల్లో నీటి సామర్ధ్యం పెరిగిందన్నారు. ఈ సామర్ధ్యాన్ని బట్టి ప్రభుత్వమే చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలు విడుస్తోందని... దీంతో చేపలు రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా ఇతర రాష్ట్రాలకు పెద్దఎత్తున ఎగుమతి అవుతున్నాయని అన్నారు. 

తెలంగాణలో చేప మాంసం వినియోగం పెద్ద ఎత్తున పెంచాలని మంత్రి ప్రజలకు సూచించారు. చికెన్, మటన్ వినియోగం తగ్గించాలని... ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే చేపలను తినాలని మంత్రి సూచించారు.

 తెలంగాణలో తొలి మత్స్య కళాశాల పెబ్బేరులో ఏర్పాటు చేసినట్లు.. ఇప్పటికే తొలి బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకుని వెళ్లిపోయిందని నిరంజన్ రెడ్డి తెలిపారు. మత్య్స కళాశాల విద్యార్థులు స్వయంగా చేపల వినియోగం పెంచేందుకు వంటలు తయారుచేసి అమ్మడం అభినందనీయమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మత్య్స సహకార సంఘంలోని సోదర సోదరీమణులు ఉచిత చేప పిల్లలు, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని వ్యవసాయ మంత్రి సూచించారు. 

 

click me!