బెల్లంపల్లి ఎమ్మెల్యే లైంగిక వేధింపులపై యువతి ఎన్‌సీడబ్ల్యులో ఫిర్యాదు: విచారణకు ఆదేశం

By narsimha lodeFirst Published Jun 8, 2023, 3:56 PM IST
Highlights

బెల్లంపల్లి  ఎమ్మెల్యే  దుర్గం  చిన్నయ్యపై   లైంగిక వేధింపులపై  ఓ యువతి  చేసిన  ఫిర్యాదుపై  విచారణ  చేయాలని  జాతీయ మహిళా  కమిషన్  తెలంగాణ పోలీసులను ఆదేశించారు. 


న్యూఢిల్లీ: బెల్లంపల్లి  ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా   ఓ యువతి  జాతీయ  మహిళా కమిషన్ కు  ఫిర్యాదు  చేసింది.ఈ ఫిర్యాదుపై  జాతీయ  మహిళా కమిషన్  విచారణకు  ఆదేశించింది. ఈ మేరకు  తెలంగాణ డీజీపీకి  ఆదేశాలు  జారీ చేసింది.  15 రోజుల్లో నివేదిక  ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ తెలంగాణ డీజీపీకి లేఖ  రాసింది. 

ఈ ఏడాది మే  30వ తేదీన  ఆరిజన్ డెయిరీ నిర్వాహకురాలు  శేజల్ జాతీయ మహిళా కమిషన్ కు  ఫిర్యాదు  చేసింది. అంతే కాదు తనకు న్యాయం చేయాలని కోరుతూ  ఆమె  ఢిల్లీలో  ఆత్మహాత్యాయత్నం  కూడ  చేసింది. ఆత్మాహత్యాయత్నం  చేసిన తర్వాత ఆమెను ఆసుపత్రిలో  చేర్పించారు.   ఆసుపత్రిలో  చికిత్స పొందిన తర్వాత  ఆమె  ఆసుపత్రి నుండి డిశ్చార్జ్  అయ్యారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం  చిన్నయ్యపై  మహిళ  ఆరోపణలు  చేసింది.

 ఈ ఆరోపణలను  ఎమ్మెల్యే  దుర్గం  చిన్నయ్య తోసిపుచ్చారు. ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలపై  పోలీసులకు పిర్యాదు చేసినా కూడ  పట్టించుకోలేదని  బాధితురాలు గతంలో  మీడియా  వేదికగా ఆరోపణలు  చేసింది.  తనకు  న్యాయం చేయాలని కోరుతూ   బాధితురాలు  ఢిల్లీలోని  జంతర్ మంతర్ వద్ద కూడ  ఆందోళనకు దిగింది.  డెయిరీకి సంబంధించిన  విషయమై మాట్లాడేందుకు  పిలిచిన సమయంలో  లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆమె ఆరోపణలు  చేసింది.

ఈ ఆరోపణల వెనుక  రాజకీయ కుట్ర ఉందని  ఎమ్మెల్యే  దుర్గం  చిన్నయ్య   ఆరోపించారు.  తనపై  చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.  ఎమ్మెల్యే  దుర్గం  చిన్నయ్యపై  యువతి చేసిన ఆరోపణలపై   జాతీయ మహిళా కమిషన్  ప్రస్తుతం  స్పందించింది. ఈ విషయమై  పోలీసుల విచారణలో  ఏం తేలనుందోననేది  సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 

click me!