
Damodar Raja Narasimha: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. రాజకీయ, సినీ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. నకిలీ అకౌంట్లు, ఫేక్ లింక్స్ పంపించి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇతరులను బ్యాక్ మెయిల్ చేస్తూ.. అందిన కాడికి డబ్బులు దండుకుంటున్నారు. ఇలా చేస్తూ ప్రభుత్వాలు, పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
ఇలాంటి కేసులను సీరియస్ తీసుకుంటున్న సైబర్ క్రైం పోలీసులు వారి ఆటకట్టిస్తున్నారు. అయినా వారి ఆగడాలు తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర వైద్యారోగ్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజీనే హ్యాక్ చేశారు. ఆ ఫేస్ బుక్ పేజీ నుంచి వేరే పార్టీలకు చెందిన పోస్టులు వందల సంఖ్యలో పోస్టు చేశారు. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు షాకయ్యారు.
ఈ క్రమంలో పలువురు నేతలు డైరెక్ట్ గా మంత్రి దామోదరకు ఫోన్ చేసి..తమ ఫేస్ బుక్ లో వేరే పార్టీకి సంబంధించినవే ఉన్నాయని చెప్పడంతో మంత్రికి అసలు విషయం తెలియవచ్చింది. వెంటనే అప్రమత్తమైన మంత్రి ..తన ఫేస్ బుక్ పేజీని ఎవరో హ్యాక్ చేశారని అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ హ్యాకింగ్ ఘటనపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తన ఫేస్ బుక్ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దని మంత్రి కార్యకర్తలకు సూచించారు. నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.