
హైదరాబాద్: ప్రధాని మోడీకి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోడీ ఫ్రెండ్ అబ్బాస్ నిజంగానే ఉండి ఉంటే.. ఆయనను ఒకసారి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల గురించి అడగాలని కోరారు. మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవేనా? కావా? అని ఒకసారి ఆయనను అడగాలని అన్నారు. ఓ టీవీ డిబేట్‌లో మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆమెను జాతీయ ప్రతినిధి నుంచి పార్టీ సస్పెండ్ చేసింది.
ప్రధాని మోడీ తన తల్లి 99వ జన్మదినం సందర్భంగా ఆయన తన బాల్యపు జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అందులో అబ్బాస్ అనే తన మిత్రుడిని ప్రస్తావించారు. తన తండ్రి క్లోజ్ ఫ్రెండ్ ఒకరు తమకు దగ్గరలోని ఓ గ్రామంలో ఉండేవాడని, తండ్రి మిత్రుడి మరణంతో ఆయన కొడుకు అబ్బాస్ ఒంటరి అయ్యాడని వివరించారు. తర్వాత అబ్బాస్‌ను తన తండ్రి ఇంటికి తెచ్చాడని పేర్కొన్నారు. అబ్బాస్ తమతోనే ఉండి చదువుకున్నాడని వివరించారు. తమ పట్ల అమ్మ చూపుతున్న ప్రేమనే అబ్బాస్ కు కూడా చూపించేదని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలను అసదుద్దీన్ ఒవైసీ గుర్తు చేస్తూ ప్రధాని మోడీపై కామెంట్లు చేశారు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రధాని మోడీ తన మిత్రుడిని గుర్తు చేసుకున్నాడని వివరించారు. ఆయనకు మిత్రుడు ఉన్నాడనే విషయం తెలియదు అంటూ వ్యంగ్యం పలికారు. అయితే, నిజంగా అబ్బాస్ అనే మిత్రుడు ఉండి ఉంటే ఆయనను పిలుచుకుని తన, మతపెద్దల ప్రసంగాలను వినిపించండని, తాము ఏమైనా తప్పు మాట్లాడుతున్నామేమో అడగండి అంటూ తెలిపారు.
మీరు కలుసుకోలేకపోతే.. తనకు అడ్రెస్ ఇస్తే.. తానే వెళ్లి కలిసి వస్తానని అన్నారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమా? కాదా? అనే విషయాన్ని అబ్బాస్‌ను తాను అడుగుతానని చెప్పారు. నుపుర్ శర్మ తప్పుగా మాట్లాడిందని ఆయన కచ్చితంగా చెప్పుతాడని పేర్కొన్నారు.
ప్రధాని మోడీ ఆయన మిత్రుడిని గుర్తు చేసుకున్నారని వివరించారు. ఇది ఒక కథ కూడా కావొచ్చని, తనకెలా తెలుస్తుందని పేర్కొన్నారు. ఎందుకంటే ఆయన అచ్చే దిన్ అనే హామీ కూడా ఇచ్చి ఉన్నాడని వివరించారు.