రాజాసింగ్ ను అసెంబ్లీ నుండి బహిష్కరించాలి: స్పీకర్ కు ఎంఐఎం లేఖ

By narsimha lodeFirst Published Aug 24, 2022, 3:17 PM IST
Highlights

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అసెంబ్లీ నుండి బహిష్కరించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ రాశారు. 

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అసెంబ్లీ నుండి బహిష్కరించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ రాశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన దానికి వ్యతిరేకంగా రాజాసింగ్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆ లేఖలో ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ చెప్పారు. ఈ వ్యాఖ్యల ఆధారంగా రాజాసింగ్ ను  అసెంబ్లీ నుండి బహిష్కరించేందుకు గాను అవసరమైన ప్రోసీడింగ్స్ ను మొదలు పెట్టాలని కూడా ఆ లేఖలో కోరారు. 

ఈ నెల 20న మునావర్ ఫరూఖీ  కామెడీ షో నిర్వహణకు పోలీసులు అనుమతించడంపై రాజాసింగ్ మండిపడ్డారు.ఈ  షో ను అడ్డుకుంటామని రాజాసింగ్ ప్రకటించారు. అయితే ఈ షో నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడలేదు. ఈ షో నిర్వహణకు అనుమతి ఇవ్వవద్దని కోరినా పోలీసులు అనుమతివ్వడంపై రాజాసింగ్ తెలంగాణ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఈ విషయమై యూట్యూబ్ లో ఓ వీడియోను అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలో రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆరోపిస్తుంది.ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ నెల 22 న రాత్రి నుండి 23వ తేదీ ఉదయం వరకు హైద్రాబాద్ సీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ విషయమై హైద్రాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మంగళ్ హాట్, డబీర్ పురా సహా పలు పోలీస్ స్టేషన్లలో రాజాసింగ్ పై కేసులు నమోదయ్యాయి. మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో రాజాసింగ్ ను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం నాంపల్లి కోర్టు రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది.

సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందున రాజాసింగ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది బీజేపీ.  10 రోజుల్లోపుగా ఈ విషయమై వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది.  బీజేపీ శాసనసభపక్షనేత పదవి నుండి కూడ పార్టీ తప్పించింది.

click me!