Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర నాలుగు రోజుల పాటు కన్నుల పండువగా సాగింది. ఫిబ్రవరి 21 నుంచి జరుగుతున్న ఈ జాతర సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల వన ప్రవేశంతో పరిసమాప్తమైంది. ఈ జాతరకు ఎంతమంది వచ్చారంటే..?
Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర నాలుగు రోజుల పాటు కన్నుల పండువగా సాగింది. రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే మేడారం మహా జాతర శనివారంతో ముగిసింది. ఫిబ్రవరి 21 నుంచి జరుగుతున్న ఈ జాతర.. సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల వన ప్రవేశంతో పరిసమాప్తమైంది. డారం గద్దెపై నుంచి చిలకలగుట్టకు సమ్మక్క చేరుకోగా.. కన్నెపల్లికి సారలమ్మను, పూనుగొండ్లకు పగిడిద్దరాజును, కొండాయికి గోవిందరాజులను తీసుకెళ్లారు. భక్తులు జయజయ ధ్వానాలు చేస్తూ అమ్మవార్లకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ జాతరకు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఇంఛార్జీలుగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఈ సందర్భంగా మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ డి.అనసూయ (సీతక్క ) మాట్లాడారు. మేడారం జాతర విజయవంతం కోసం కృషి చేసిన ప్రజలు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నాలుగు రోజుల జాతరలో దాదాపు 1.45 కోట్ల మంది భక్తులు సమ్మక్క, సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. నిర్వహణకు తగిన నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.మేడారం వసతుల కోసం రాష్ట్రప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు కేటాయించిందని వెల్లడించారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న మేడారం, పరిసర ప్రాంతాల్లో మరమ్మతులకు నిధులు వినియోగించినట్లు తెలిపారు
ఈ జాతర కోసం 20శాఖల అధికారులు కష్టపడి పనిచేశారనీ, భక్తులకు ఇబ్బంది లేకుండా తమ వంతు కృషి చేశామని తెలిపారు. జాతర కోసం ఆర్టీసీ దాదాపు 6వేల బస్సులను కేటాయించిందనీ, 12 వేల ట్రిప్పులు నడిపిన టీఎస్‌ఆర్టీసీని మంత్రి అభినందించారు. ఈ జాతరలో 5,090 మంది తప్పిపోగా.. వారిలో 5,060 మందిని అధికారులు గుర్తించి వారి కుటుంబీకులకు అప్పగించారనీ, మిగిలిన చిన్నారులు అధికారుల వద్ద జాగ్రత్తగా ఉన్నారని తెలిపారు. తప్పిపోయిన వారి వివరాల కోసం మీడియాపాయింట్ , జంపన్నవాగు వద్ద ఏర్పాటు చేసిన మిస్సింగ్ పాయింట్‌లో సంప్రదించాలని అన్నారు. మేడారంలో పది రోజుల పాటు పారిశుద్ధ్య పనులు జరుగుతాయనీ, ఇందుకోసం దాదాపు 4వేల మంది కార్మికులను నియమించామని మంత్రి వివరించారు. అలాగే.. అర్చకులకు, ఆదివాసీలకు కృతజ్ఞతలు తెలుపుతూ డాక్టర్ సీతక్క మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగనున్న మినీ మేడారం జాతరలోపు గుర్తించిన లోపాలను సరిదిద్దడమే కాకుండా శాశ్వత పరిష్కారాలు చూపుతామన్నారు. సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.
ఇదిలా ఉంటే.. శనివారం చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బస్సు సర్వీసులు పెరగడం, సాంకేతిక సమస్యలతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దాదాపు కోటిన్నరకు పైగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పలువురు మంత్రులు, మాజీమంత్రులు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు రాజకీయ నేతలు, ప్రముఖలు జాతరకు హాజరయ్యారు. అమ్మలకు మొక్కులు చెల్లించి..నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు.