తన నివాసంలో ఐటీ అధికారుల సోదాలపై మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తాను విదేశాల్లో పెట్టుబడులు పెట్టలేదని ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: విదేశాల్లో తాను ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ కు చెందిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో బుధవారం నాడు ఉదయం నుండి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారుల సోదాలపై మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఐటీ సోదాలకు తనకు సంబంధం లేదన్నారు. ఐటీ అధికారులు జారీ చేసిన నోటీసులపై స్పందించనున్నట్టుగా చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలతో కలిసి తాను వ్యాపారాలు చేస్తున్న విషయాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తోసిపుచ్చారు. ఐటీ అధికారులకు సమాధానం ఇస్తానని చెప్పారు.
ఎన్నికల ముందు తనపై బురద చల్లేందుకు ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారన్నారు. 1986 నుండి తాను వ్యాపారం చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. తనది వైట్ పేపర్ బిజినెస్ అని కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తన ఇంటిపై ఐటీ దాడులు కొండను తవ్వి ఎలుకను పట్టే విధంగా ఉంటుందన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఐటీ దాడులు ఇప్పుడెందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న ఐటీ సోదాలను ప్రజలు గమనించాలని కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. తన ఆస్తులన్నింటికి ఆధారాలు చూపిస్తానని కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీగా ఎన్నిక కాకముందు ట్రావెల్స్ సంస్థ నిర్వహించేవారు.
హైద్రాబాద్ కొండాపూర్ లోని ఎంపీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ అధఇకారులు నిర్వహించేందుకు వెళ్లిన సమయంలో ప్రభాకర్ రెడ్డి హైద్రాబాద్ లో లేరు. ఆయన మెదక్ లో ఉన్నారు. ఐటీ సోదాలకు సంబంధించిన సమాచారాన్ని ఎంపీకి ఐటీ అధికారులు ఇచ్చారని సమాచారం.
also read:హైద్రాబాద్ లో ఐటీ సోదాల కలకలం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఇంట్లో సోదాలు
ఇవాళ ఉదయం నుండి హైద్రాబాద్ లో ముగ్గురు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంతో పాటు ఆయనకు చెందిన రియల్ ఏస్టేట్ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి చెందిన ఇంటితో పాటు ఆయనకు చెందిన జేసీ బ్రదర్స్ వస్త్ర దుకాణంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ, ఒడిశాకు చెందిన ఐటీ అధికారుల బృందం ఈ ముగ్గురు ప్రజా ప్రతినిధుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.