కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి రాజీనామా చేశారు.
హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీకి డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆదివారంనాడు రాజీనామా చేశారు. మెదక్ అసెంబ్లీ టిక్కెట్టును తిరుపతి రెడ్డి ఆశించారు. అయితే ఈ స్థానం నుండి మైనంపల్లి హన్మంతరావు తనయుడు రోహిత్ కు టిక్కెట్టు దక్కే అవకాశం ఉండడంతో కంఠారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.
గత వారమే బీఆర్ఎస్ కు మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేశారు. న్యూఢిల్లీలో ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో గత నె 28న కాంగ్రెస్ లో చేరారు.వచ్చే ఎన్నికల సమయంలో మల్కాజిగిరి నుండి మైనంపల్లి హన్మంతరావు, మెదక్ నుండి హన్మంతరావు తనయుడు రోహిత్ కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగనున్నారు. మెదక్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావు 2009-2014 వరకు ప్రాతినిథ్యం వహించాడు. మెదక్ అసెంబ్లీ స్థానం నుండి కొంత కాలంగా రోహిత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకే రోహిత్ మెదక్ అసెంబ్లీ స్థానంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెదక్ నుండి బీఆర్ఎస్ టిక్కెట్టును తన కొడుకు రోహిత్ కు ఇవ్వాలని మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరారు. కానీ, బీఆర్ఎస్ నాయకత్వం సానుకూలంగా స్పందించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే టిక్కెట్టు కేటాయించింది. దీంతో మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి హన్మంతరావు విమర్శలు గుప్పించారు. మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అనుచరులతో సమావేశాలు నిర్వహించిన తర్వాత బీఆర్ఎస్ కు మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేశారు.
undefined
also read:బీఆర్ఎస్‌కు షాక్: రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి
అయితే మైనంపల్లి హన్మంతరావు తనయుడికి మెదక్ అసెంబ్లీ టిక్కెట్టును కేటాయించే అవకాశం ఉందని తేలడంతో తిరుపతి రెడ్డి కాంగ్రెస్ ను వీడారు. డబ్బు సంచులు అందించిన వారికే పార్టీ టిక్కెట్లు ఇవ్వడమేనా కర్ణాటక మోడలా అని ఆయన ప్రశ్నించారు. పార్టీ కోసం ఇంతకాలం పనిచేసిన వారికి కాకుండా డబ్బులున్నవారికి టిక్కెట్లు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. తనను పార్టీ అభ్యర్ధిగా తొలుత హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడేమో మరొకరికి టిక్కెట్టు కేటాయించాలని నిర్ణయం తీసుకోవడాన్ని తిరుపతి రెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపిన రాజీనామా లేఖలో ఈ అంశాలను ఆయన ప్రస్తావించారు.