
MCL Kavitha: తెలంగాణలో వరి ధాన్యం సేకరణ విషయంలో అధికార టీఆర్ఎస్ కు , ప్రతిపక్ష బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే.. భగ్గుమనేటట్టు ఉంది. తాజా మరోసారి ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం క్లారిటీ ఇవ్వాలని టీఆర్ ఎస్ ఒత్తిడి చేస్తుంది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ విషయంలో తగ్గెదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా టీఆర్ఎస్ పై ఎదురు దాడికి దిగుతున్నారు.
ఈ సందర్భంలో కేంద్రంపై మరో యుద్ధం చేయడానికి సీఎం కేసీఆర్ సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో
ఎమ్మెల్సీ కవిత రంగంలోకి దిగింది. తనదైన శైలిలో తెలంగాణ బీజేపీ నేతలపై విమర్శనాస్త్రాలను సంధించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నాయకులు తీరును ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయి లో మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ బీజేపీ నాయకుల వైఖరి చూస్తుంటే.. వాళ్ళసలు తెలంగాణ బిడ్డలేనా అని అనిపిస్తోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ధాన్యం సేకరణలో దేశమంతటా ఒకే విధానం ఉండాలని పేర్కొన్న కవిత, తెలంగాణ రైతుల పక్షాన సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
ధాన్యం కోనుగొలు విషయంలో కేంద్ర ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఒక నీతి.. వేరే రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని విమర్శించారు. పంజాబ్ రాష్ట్రంలో ఏవిధంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారో .. అదే తరహాలో తెలంగాణలోని వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే.. వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీని వెంటనే రూపొందించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. పంజాబ్ నుంచి ఎలా 100 శాతం వరి ధాన్యాన్ని సేకరిస్తున్నారో.. తెలంగాణ నుంచి 100 శాతం వరిధాన్యాన్ని సేకరించాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ)ని డిమాండ్ చేస్తూ .. ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు.