తెలంగాణలో పొలిటికల్ హీట్... భట్టి విక్రమార్కతో పొంగులేటి ఏకాంత భేటీ (వీడియో)

Published : Jun 22, 2023, 12:43 PM ISTUpdated : Jun 22, 2023, 12:51 PM IST
తెలంగాణలో పొలిటికల్ హీట్... భట్టి విక్రమార్కతో పొంగులేటి ఏకాంత భేటీ (వీడియో)

సారాంశం

కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దమైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. 

నల్గొండ : తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ నింపింది. ఇక కాంగ్రెస్ జోరు చూసి ఆ పార్టీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరడానికి సిద్దమయ్యారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకులతో సమావేశమై చేరిక గురించి చర్చిస్తున్న పొంగులేటి తాజాగా సిఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. 

ప్రస్తుతం నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేస్తున్న భట్టిని ఇవాళ పొంగులేటి కలిసారు. కేతేపల్లి వద్ద పాదయాత్ర శిబిరంలోని వీరిద్దరు భేటీ అయ్యారు. మండుటెండలో పాదయాత్ర కొనసాగించిన భట్టి విక్రమార్క ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న పొంగులేటి కాంగ్రెస్ లో చేరికపైనా చర్చించినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నాయకుల భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురయిన భట్టి విక్రమార్కను మొదట పరామర్శించారు మాజీ ఎంపీ పొంగులేటి. అనంతరం పాదయాత్ర శిబిరంలోనే ఇద్దరు నేతలు ప్రత్యేకంగా భేటీ అయి రాజకీయపరమైన అంశాలపై చర్చించారు. ముఖ్యంగా తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చే వ్యూహాల గురించి వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలపై వీరు చర్చించుకున్నారు. 

వీడియో

ఇక ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపైనా భట్టి, పొంగులేటి మధ్య చర్చ జరిగింది. త్వరలో జరగబోయే పాదయాత్ర ముగింపు సభను సక్సెస్ చేసేందుకు ఎలా ముందుకు వెళ్లాలో కూడా వీరు చర్చించుకున్నారు. ఇక కాంగ్రెస్ లో చేరికపై కూడా సీనియర్ నాయకుడు భట్టితో పొంగులేటి చర్చించారు.

ఇక ఇప్పటికే టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో కూడిన బృందం పొంగులేటితో భేటీ అయ్యింది. హైదరాబాద్ లోని పొంగులేటి నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు పార్టీలోకి ఆహ్వానించారు. రెండుమూడు గంటల పాటు శ్రీనివాస్ రెడ్డితో కాంగ్రెస్ బృందం భేటీ అయ్యింది. రేవంత్ తో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్లు రవి, చిన్నారెడ్డి తదితరులు మాజీ ఎంపీతో భేటీ అయి పార్టీలో చేరాలని కోరారు. 

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కూడా రేవంత్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేతలతో కలిసి జూపల్లి ఇంటికివెళ్లి లంచ్ మీటింగ్ జరిపింది కాంగ్రెస్ బృందం. బిఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ భారీగా చేరికలను ఆహ్వానిస్తోంది.

 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్