
ఖమ్మం : ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని వరకట్నం తేవాలంటూ వేధించడంతో బాలింత మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మం నగరం రామన్నపేటలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఖానాపురం హవేలి సీఐ రామక్రిష్ణ కథనం ప్రకారం.. రామన్నపేటకు చెందిన ఆటోడ్రైవర్ కొత్తా ఎలీషా, టేకులపల్లి మండలం సులానగర్ కు చెందిన శైలజ (22) పెద్దలను ఎదిరించి 2017లో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల, రెండు నెలల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో సారి ఆడపిల్ల పుట్టిందని వరకట్నం తేవాలంటూ ఎలీషా.. శైలజను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు.
స్థానికంగా నివసించే ఓ మహిళతోనూ అతను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై అత్తమామలు చెప్పి చూసినా అతనిలో మార్పు రాలేదు. మనస్థాపానికి గురైన శైలజ స్థానికంగా రైతులు ఉపయోగించే మూలికలను తిని పడిపోయింది. ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు అనాధలు కావడంతో బంధువుల రోదనలు అందరికీ కంటతడి పెట్టించాయి. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.
ఎమ్మెల్యేల ప్రలోభాలపై ప్రత్యేక బృందంతో విచారణకై బీజేపీ పిటిషన్:రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
తహసిల్దారు పంచానామా : వారి వివాహమై ఏడేళ్ల లోపు కావడంతో అర్బన్ తహసీల్దారు శైలజ పంచనామాలో పాల్గొన్నారు. అలాగే కుల వేధింపుల కేసు కావడంతో ఏసీపీ ఆంజనేయులు విచారణ జరిపారు.
ఇదిలా ఉండగా, ప్రేమించి పెళ్లి చేసుకుని.. భార్యను వేధించిన ఘటనలో ఓ ఎస్సైపై దిశా పోలీసులు అక్టోబర్ 7న కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. వేదాయపాలెం ఎస్సైగా షేక్ మెహబూబ్ సుభాని పనిచేస్తున్నాడు. ఆయన సంతపేటలో విధులు నిర్వహించే సమయంలో కానిస్టేబుల్ గా ఉన్న ఓ యువతిని ప్రేమించి, వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అదనపు కట్నం కోసం ఆమెను భర్త, అత్తింటివారు వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు.
ఇదే విషయమై గత నెల 9వ తేదీన ఆమె మీద భర్త, అత్త దాడి చేశారు. ఈ క్రమంలోనే ఎస్సై సెలవు పెట్టి తన స్వగ్రామానికి వెళ్లి పోయాడు. బాధితురాలు గత నెల 28న దిశా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై, అతని కుటుంబ సభ్యులపై వేధింపులు, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె. లేఖా ప్రియాంక కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ కేసుపై గోప్యంగా విచారణ చేపట్టారు.