
హైదరాబాద్ : కట్టుకున్నవాడు తాగుడుకు బానిసై పనీపాట లేకుండా తిరగుతుండటం ఆమె భరించలేకపోయింది. ఎంత చెప్పినా పనికి వెళ్ళకపోగా తన సంపాదనను కూడా తాగుడుకు తగలేయడంతో ఆ ఇల్లాలును మరింత మనోవేదనకు గురిచేసింది. ఇలా భర్త తీరుతో జీవితంపైనే విరక్తిచెందిన భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
మహబూబ్ నగర్ జిల్లా ధరూర్ మండల కొండాపూర్ గ్రామానికి చెందిన అంజలికి నరేంద్రతో పదేళ్ళక్రితం పెళ్లయ్యింది. ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చిన దంపతులు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని శ్రీరాంనగర్ లో నివాసముంటున్నారు. అంజలి కాల్ సెంటర్ లో పనిచేస్తుండగా నరేంద్ర ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వార్డ్ బాయ్ గా పనిచేసేవాడు. ఇలా భార్యాభర్తలిద్దరూ పనిచేసుకుంటూ హాయిగా జీవిస్తుండగా మద్యం మహమ్మారి సంసారంలో చిచ్చుపెట్టింది.
తాగుడుకు బానిసైన నరేంద్ర హాస్పిటల్లో పని మానేసాడు. అతడికి సంపాదన లేకపోవడంతో భార్య డబ్బులతో మద్యం తాగడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా సెల్ ఫోన్లు, ఇంట్లోని వస్తువులు అమ్ముకుని మరీ తాగసాగాడు. ఇలా చేయడం సరికాదని... తీరు మార్చుకోవాలని అంజలి భర్తకు ఎన్నోసార్లు చెప్పిచూసింది. కానీ అతడు మారకపోవడంతో ఆమె దారుణ నిర్ణయం తీసుకుంది.
Read More శంషాబాద్ లో దారుణం : మహిళను చంపి.. పెట్రోల్ పోసి నిప్పంటించారు..
గురువారం తెల్లవారుజామున తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని అంజలి ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత నిద్రలేచిన భర్త భార్యను గమనించాడు. కానీ అప్పటికే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో అతడు కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించాడు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అంజలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన సోదరి ఆత్మహత్యకు ఆమె భర్త నరేంద్ర కారణమని అతడు ఫిర్యాదుతో పేర్కొన్నాడు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)