
కరీంనగర్ : 'మానవ బంధాలన్ని ఆర్థిక సంబంధాలే' అన్న మాటలను ఓ పెళ్లిల్ల బ్రోకర్ ఫాలో అయ్యాడు. బంధాలు, బంధుత్వాలకు విలువన్నదే లేకుండా కేవలం డబ్బుల కోసం ఓ మహిళను అంగట్లో బొమ్మలా మార్చాడు. కేవలం ఒకే మహిళను అనేకమందితో పెళ్లిచేసి ఘరానా మోసాలకు పాల్పడ్డాడు. చివరకు అతడి పాపం పండి ఓ బాధితుడికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. తనతో పెళ్లిచేసిన మహిళకే మరొకరితో కూడా పెళ్లి చేయించి పెళ్లిల్ల బ్రోకర్ ను బాధితుడు పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. పెళ్లిల్ల పేరిట జరుగుతున్న ఈ ఘరానా మోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లికి చెందిన లక్ష్మణ్ భార్య చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. రెండో పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న అతడికి కర్ణాటకకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు తెలిసిన ఓ అమ్మాయి వుందని... ఆమెతో పెళ్లి జరిగేలా చూస్తానని చెప్పి లక్ష్మణ్ వద్ద కొంత డబ్బు తీసుకున్నాడు. అన్నట్లుగానే ఓ మహిళతో పెళ్లికూడా చూసాడు.
అయితే పెళ్లయిన కొద్దిరోజులకే పుట్టింటికి వెళ్లివస్తానని భర్త లక్ష్మణ్ తో చెప్పివెళ్ళింది మహిళ. ఎన్నిరోజులకూ భార్య తిరిగిరాకపోవడంతో కంగారుపడిపోయిన లక్ష్మణ్ ఎంతవెతికినా భార్య ఆచూకీ లభించలేదు. దీంతో అతడు శివకుమార్ కు ఫోన్ చేసినా సరయిన సమాధానం చెప్పకపోవడం, కాల్ లిప్ట్ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. తనను మోసం చేసిన మహిళతో పాటు పెళ్లిల్ల బ్రోకర్ ఆటకట్టించాలని లక్ష్మణ్ నిర్ణయించుకున్నాడు.
అయితే తనతో పెళ్లిచేసిన మహిళకే జగిత్యాల జిల్లాకు చెందిన మరో వ్యక్తితో పెళ్లి చేసాడు శివకుమార్. ఈ విషయం ఎలాగోలా తెలుసుకున్న లక్ష్మణ్ ఆ పెళ్లి వీడియోను సంపాదించాడు. ఇందులో మహిళతో పాటు శివకుమార్ కూడా వుండటంతో వారిని చూపించి వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఓ పెళ్లి వేడుక కోసం శివకుమార్ వేములవాడ వచ్చినట్లుగా సమాచారం అందింది. కొంతమందిని వెంటపెట్టుకుని అక్కడికి వెళ్లిన లక్ష్మణ్ తనను మోసం చేసిన శివకుమార్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు.
పెళ్లి పేరిట తనను మోసం చేసాడంటూ బాధితుడు లక్ష్మణ్ ఫిర్యాదు చేయడంతో శివకుమార్ పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసారు. అతడి మోసాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు... ఇంకా బాధితులు ఎవరైనా వుంటే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఇలాంటి మోసాల పట్లు అప్రమత్తంగా వుండాలని వేములవాడ పోలీసులు ప్రజలకు సూచించారు.