మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై మావోయిస్టుల ఘాటు లేఖ.. ఆ విషయాన్ని బయటికి రానివ్వలేదు

By Mahesh K  |  First Published Oct 27, 2023, 7:21 PM IST

మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై మావోయిస్టుల ఘాటు లేఖ విడుదల చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కేసీఆర్‌దే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. నిర్మాణ సమయంలోనే పగుళ్లు ఏర్పడినా బయటికి రానివ్వలేదని ఆరోపించారు.
 


హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై మావోయిస్టులు ఓ ఘాటు లేఖ విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని తెలిపారు. ఆ పిల్లర్లు కుంగిపోవడానికి నాణ్యత లోపమే కారణం అంటూ వివరించారు. నిర్మాణ సమయంలోనూ పగుళ్లు ఏర్పడ్డాయని, కానీ, ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదని పేర్కొన్నారు.

మావోయిస్టు జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ పేరుతో ఈ లేఖను విడుదల చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మించి మూడు సంవత్సరాలే అవుతుందని, ఇంతలోనే కుంగిపోవడానికి కారణం నాణ్యత లోపమేనని తెలిపారు. 2016 మే 2వ తేదీన నిర్మాణం మొదలుపెట్టగా 2019లో ప్రారంభించారని వారు ఆ లేఖలో వివరించారు. ఈ బ్యారేజీ స్వల్ప కాలంలోనే కుంగిపోవడానికి కారణం కేసీఆర్ కుటుంబమేనని సంచలన ఆరోపణలు చేశారు. భారీగా కమీషన్లు తీసుకుని నాసిరకంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు.

Latest Videos

Also Read : పాలేరు స్థానంలో ఉత్కంఠ రాజకీయం.. హుజురాబాద్ బైపోల్ హీట్ రిపీట్?

వాస్తవానికి ఇది నిర్మిస్తున్న సమయంలోనే పగుళ్లు ఏర్పడ్డాయని మావోయిస్టులు పేర్కొన్నారు. కానీ, ఆ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదని వివరించారు. ప్రజలను, ప్రజా సంఘాలను, బూర్జువా పార్టీలను సైతం అక్కడికి రానివ్వకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయం బయటకు రాకుండా అడ్డుకున్నారని వివరించారు. మీడియాను కూడా మేనేజ్ చేశారని, ప్రజాధనం వృధా చేసిన బాధ్యత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. 

డిజైన్ లోపమని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండగా.. ఫౌండేషన్ కింద ఇసుక పక్కకు జరగడంతో ఖాళీ ఏర్పడి మేడిగడ్డ పియర్ కుంగిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ తమ ప్రాథమిక విచారణలో తేలిందని వివరించింది.

click me!