పార్టీ మారినవారికి శిక్ష తప్పదు: మాణికం ఠాగూర్ వార్నింగ్

By narsimha lodeFirst Published Feb 7, 2021, 5:54 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ మారినవారికి శిక్ష తప్పదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణికం ఠాగూర్ హెచ్చరించారు.

ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ మారినవారికి శిక్ష తప్పదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణికం ఠాగూర్ హెచ్చరించారు.

ఖమ్మంలో ఆదివారం నాడు జరిగిన కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో మాణికం ఠాగూర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పై గెలిచి పార్టీ మారిన నేతలను తిరిగి భవిష్యత్తుల్లో పార్టీలో చేర్చుకోబోమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే  అవినీతి నేతలను శిక్షిస్తామని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నేతలంతా తమ శక్తివంచన లేకుండా పనిచేయాలని ఆయన కోరారు.

అంతకుముందు  టీపీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగినా ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన టీఆర్ఎస్ ను ప్రశ్నించారు. గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టికెట్టు రాకుండా  పువ్వాడ అజయ్ కుమార్ అడ్డుకొన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

ఐకేపీ సెంటర్లు  కొనసాగించాలని కోరిన మంత్రి ఈటల రాజేందర్ ను అభినందిస్తున్నట్టుగా ఉత్తమ్ చెప్పారు. రాహుల్‌గాంధీ ఎఐసీసీ బాధ్యతలు చేపట్టాలని ఈ సమావేశం తీర్మానం చేసింది.
 

click me!