
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ కెప్టెన్ మాత్రమేనని చెప్పారు. పార్టీకి నాయకులు కాదు.. పార్టీనే ముఖ్యమని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు మంచి మిత్రుడని చెప్పారు. ఇంటికి పిలిచి బిర్యానీ పెట్టాడని తెలిపారు. బీజేపీలో చేరినవాళ్లు తనపై ఏదైనా మాట్లాడతారని అన్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలసుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో చాలా మంది సమర్ధులైన నాయకులు ఉన్నారని అన్నారు. తాను సోనియా ఏజెంట్‌నని, ఇంకెవరికీ ఏజెంట్‌ను కాదని చెప్పారు.
ముంపు ప్రాంతాలు, ప్రాజెక్ట్‌ల సందర్శనకు వెళ్తున్న సీఎల్పీ నేతలను, పార్టీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం దారుణమని మాణిక్కం ఠాగూర్ అన్నారు. ప్రాజెక్టుల సందర్శనకు వెళితే తప్పేంటని ప్రశ్నించారు. మర్రి శశిధర్ రెడ్డి కామెంట్స్ తాను చూడలేదని చెప్పారు.
ఇక, ఈ రోజు ఉదయం పార్టీ ముఖ్యనేతలతో మాణిక్కం ఠాగూర్ గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నిక, పార్టీ అంతర్గత అంశాలను చర్చించారు. మునుగోడులో కాంగ్రెస్ వ్యుహ ప్రచార కన్వీనర్‌గా ఉన్న మధుయాష్కీ సమావేశానికి గైర్హజరు కావడంపై మాణిక్కం ఠాగూరు అసహనం వ్యక్తం చేశారు. మునుగోడు వ్యూహ ప్రచార కన్వీనర్‌గా ఉన్న మధుయాష్కీ మాణిక్కం ఠాగూర్ పిలుపునిచ్చారు. ఈ నెల 20న మునుగోడు నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గాంధీ కుటుంబం త్యాగాల గురించి పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు.
సెప్టెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. అక్టోబర్ చివరి వారంలో తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ఉంటుందని చెప్పారు. రాబోయే వంద రోజులు కాంగ్రెస్‌కు చాలా కీలకమన్నారు.