మునుగోడు ఉప ఎన్నికలు 2022: అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు, గాంధీ భవన్ కు ఆశావాహులు

By narsimha lodeFirst Published Aug 25, 2022, 11:16 AM IST
Highlights

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీకి దిగే అభ్యర్ధి ఎంపిక విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. పోటీకి ఆసక్తిగా ఉన్న ఆశావాహులను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గాంధీ భవన్ కు పిలిచింది.  ఆశావాహులతో పార్టీ నేతలు చర్చిస్తున్నారు. 
 

హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీకి దింపే అభ్యర్ధి ఎంపిక విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. ఈ స్థానం నుండి టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు గురువారం నాడు గాంధీ భవన్ కు చేరుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ బుధవారం నాడు రాత్రి హైద్రాబాద్ కు వచ్చారు. మునుగోడు అసెంబ్లీ స్థానంంలో పోటీ చేసే అభ్యర్ధి ఎంపిక విషయమై పార్టీ ముఖ్యులతో ఠాగూర్ చర్చించారు.ఈ స్థానంలో పోటీకి ఆసక్తి చూపుతున్న వారితో చర్చించాలని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో ఇవాళ ఆశావాహులను గాంధీ భవన్ కు రావాలని పార్టీ నాయకత్వం సమాచారం పంపింది. 

పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు  పాల్వాయి స్రవంతిరెడ్డి, చలమల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, పున్న కైలాస్ నేతలు గాంధీ భవన్ కు చేరుకున్నారు. ఆశావాహులు నలుగురితో పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు చర్చిస్తున్నారు.  మునుగోడు అసెంబ్లీ స్థానంలో  పోటీక దిగే అభ్యర్ధులు ఆర్ధికంగా ఇబ్బంది లేకుండా ఉండాలనే అభిప్రాయంతో కాంగ్రెస్ శ్రేణులున్నాయి. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో  బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్ధులు భారీగా డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి కూడా అదే స్థాయిలో ఖర్చు చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. ఈ విషయాలపై కూడా ఆశావాహులతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్చించనుంది.మునుగోడులో ప్రధానంగా పాల్వాయి స్రవంతి రెడ్డి, చలమల కృష్ణారెడ్డి మధ్య టికెట్ విషయమై పోటీ నెలకొంది. 

ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉంటారు. బీజేపీ, టీఆర్ఎస్ లు  రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులను బరిలోకి దింపితే బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపాలనే యోచనలో కూడా కాంగ్రెస్ ఉంది. అయితే నియోజకవర్గంలో ఏ అభ్యర్ధిని బరిలోకి దింపితే పార్టీ విజయావకాశాలు ఎలా ఉంటాయనే విషయాలపై కూడా కాంగ్రెస్ పార్టీ సర్వే నిర్వహించింది.ఈ సర్వే ఆధారంగా కూడా అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేయనుంది.  ఇవాళ సాయంత్రం వరకు అభ్యర్ధి ఎంపికపై కసరత్తును పూర్తి చేసి అధిష్టానానికి  కాంగ్రెస్ నాయకత్వం నివేదికను పంపనుంది. ఈ నెలాఖరు లోపుగా అభ్యర్ధి ఎంపికను పూర్తి చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. 

also read:ఫలవంతంగా చర్చలు: ప్రియాంక గాంధీతో భేటీపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఇప్పటికే ఆయా మండలాల ఇంచార్జీలుగా ఉన్న పార్టీ నేతలు ఆయా గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర నాయకత్వానికి కూడా నివేదికలు పంపారు. నిన్న  రాత్రి జరిగిన సమావేశంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంచార్జీలుగా ఉన్న నేతలు కూడా పాల్గొన్నారు.
 

click me!