నూతన సంవత్సర వేడుకల్లో మానకొండూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ లీడర్ కవ్వంపల్లి సత్యనారాయణ తీరు చర్చనీయాంశమైంది. ఓ మహిళ చెంపకు కేక్ పూశారు. నెటిజన్లు ఈ వీడియోపై మండిపడగా.. కాంగ్రెస్ దీన్ని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంగా కొట్టేసింది.
kavvampally satyanarayana: ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే నూతన సంవత్సర వేడుకల్లో శృతి మించారు. చిలిపి చేష్టలు చేశారు. ఓ మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో ఇప్పుడు వైరల్ అవుతున్నది. నెటిజన్లు ఆ ఎమ్మెల్యే తీరుపై విరుచుకుపడుతున్నారు.
మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లాలోని మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ కూడా హాజరయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా అక్కడ కేక్ కట్ చేశారు. ఆ కేక్ పీస్‌లను ఒకరికి ఒకరు తినిపించుకుంటూ విషెస్ చెప్పుకున్నారు. ఇదే సమయంలో కవ్వంపల్లి సత్యనారాయణ వెనుక వైపు నుంచి తోసుకుంటూ వచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌నూ పక్కకు నెట్టి అక్కడే ఉన్న ఓ మహిళకు చెంపకు కేక్ పూశారు. ఆమె సున్నితంగానైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా.. ఎమ్మెల్యే మళ్లీ మళ్లీ కేక్ పూశారు. ఆమె అసౌకర్యంగా ఫీల్ అయినట్టు కనిపించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే చిలిపి చేష్టలు
న్యూ ఇయర్ వేడుకల్లో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిలిపి చేష్టలు. pic.twitter.com/wvyvurebqp
అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. నెటిజన్లు మండిపడుతున్నారు. వీడియోపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ స్పందించింది. బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. నిజానికి ఆ మహిళ సదరు ఎమ్మెల్యేకు బంధువేనని పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను ఓర్వలేక బీఆర్ఎస్ ఈ తప్పుడు ప్రచారానికి పూనుకుందని ఫైర్ అయింది.