మైనారిటీలో రేవంత్ ప్రభుత్వం.. కేసీఆర్‌ను కాంగ్రెస్ రక్షిస్తోంది , కాళేశ్వరంపై విచారణ ఏది : కిషన్ రెడ్డి

By Siva Kodati  |  First Published Jan 2, 2024, 2:57 PM IST

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోతుందని.. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంల మధ్య అవగాహన కుదిరిందని ఆయన వ్యాఖ్యానించారు. 


కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందన్నారు. కాళేశ్వరంపై విచారణ కోరుతూ కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ ఎందుకు రాయటం లేదని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాస్తే 48 గంటల్లో కేంద్రం సీబీఐ విచారణ చేపడుతుందని, బీఆర్ఎస్.. కాంగ్రెస్ ఒక్కటి కాదంటే సీబీఐ విచారణ కోరాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. న్యాయ విచారణ పేరుతో కేసీఆర్‌కు మేలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. 

రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజారిటీ లేదని, అందుకే బీఆర్ఎస్‌తో అవగాహనకు వచ్చిందని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోతుందని.. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంల మధ్య అవగాహన కుదిరిందని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని.. అంతే తప్ప కాంగ్రెస్ మీద ప్రేమతో ప్రజలు అధికారం ఇవ్వలేదని కిషన్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేసిన రూ. లక్ష కోట్ల పరిస్ధితి ఏంటి.. ప్రజాధనాన్ని గోదాట్లో కలిపారని ఆయన దుయ్యబట్టారు. 

Latest Videos

ప్రతిపక్షంలో వుండగా కాంగ్రెస్ పార్టీ పలుమార్లు కేసీఆర్ అవినీతిని పలుమార్లు ప్రస్తావించిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు, ప్రాజెక్ట్‌ల్లో స్కాంలపై దర్యాప్తు చేపడతామని రేవంత్ రెడ్డి అన్నారని కేంద్ర మంత్రి తెలిపారు. కేసీఆర్‌ను చీఫ్ ఇంజనీర్‌గా కీర్తించుకున్నారని, ఆయన కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు లైఫ్ లైన్‌గా వున్న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై వెంటనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి లేఖ రాశామని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. 

తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రాజెక్ట్ వివరాలను బీఆర్ఎస్ సర్కార్ గోప్యంగా వుంచిందని ఆయన ఆరోపించారు. నాలుగేళ్లకే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారి వెలవెలబోవడం, తెలంగాణ ప్రజల కష్టార్జితమంతా గోదావరి పాలు కావడం దురదృష్టకరమన్నారు. ఇంతటి అవినీతి జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒకటేనని.. కాంగ్రెస్ నుంచే కేసీఆర్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. 

click me!