సింగరేణి కార్మికుడి హత్యకు ఆరుసార్లు ప్రయత్నం.. చివరికి, భార్య ఇంట్లో ఉండగానే....

By Bukka SumabalaFirst Published Aug 23, 2022, 9:42 AM IST
Highlights

గోదావరిఖనిలో కలకలం రేపిన సింగరేణి కార్మికుడి హత్య కేసులో చివరికి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్టు తేలింది. 

గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కలకలం రేపిన సింగరేణి కార్మికుడి హత్యకేసులో పోలీసులు ముగ్గురు నిందితులను సోమవారం అరెస్టు చేశారు. మృతుడు కోరుకొప్పుల రాజేందర్ భార్య రవళి.. ప్రియుడి మోజులో హత్యకు ప్రణాళిక రచించినట్లు అధికారులు గుర్తించారు. ఆమెతోపాటు ఆమె ప్రియుడు బండం రాజు (26), సహకరించిన గులాం సయ్యద్ (21)ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన తుపాకీ, 9 బుల్లెట్లు, మూడు సెల్ఫోన్లు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట పాఠశాలలో అదే ఊరికి చెందిన బండం రాజు, రవళి పదో తరగతి వరకు చదువుకున్నారు. 

ఎదురు ఎదురు ఇల్లు, ఒకే పాఠశాల కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే, ఇంట్లో వాళ్లు రవళికి తన మేనబావ రాజేందర్ తో ఏడేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బండం రాజు తన గ్రామంలో కిరాణా షాపు నడుపుతున్నాడు.  ఈ క్రమంలో 8 నెలల క్రితం ఇంస్టాగ్రామ్ ద్వారా రాజు, రవళిలు మళ్లీ కలుసుకున్నారు. వారి మధ్య బంధం చిగురించడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే దీనికి అడ్డుగా ఉన్న భర్త రాజేందర్ ను హతమార్చాలని భావించారు.

రియాల్టర్ సూర్యప్రకాశ్ పై హైదరాబాద్ లోనే దాడి... అవమానాలు భరించలేకే.. కుటుంబంతో కలిసి...

బండం రాజు తన కస్టమర్ సయ్యద్ గులాంకు ఈ విషయం చెప్పాడు.  హత్యకు సహకరించాల్సిందిగా కోరాడు. సయ్యద్ దీనికి అంగీకరించాడు.  వాజిద్, ఇమ్రాన్ అనే ఇద్దరు మిత్రులను ఇందులో భాగస్వాములను చేశాడు. రవళి తన పుట్టింటికి వెళ్లినప్పుడు రాజేందర్ ను హత్య చేయాలని.. అలా చేస్తే ఆమెపై అనుమానం రాదని నిందితులు భావించారు. రవళి పుట్టింటికి వెళ్ళినప్పుడు రాజు, సయ్యద్ కలిసి గోదావరిఖని గంగానగర్ లోని రాజేందర్ ఇంటి గేటుకు కరెంట్ షాక్ వచ్చేలా కనెక్షన్ ఇచ్చారు. అది సఫలం కాలేదు.

రెండో ప్రయత్నంలో రాజేందర్ విధులకు వెళ్తున్నప్పుడు నిందితులు అందరూ కలిసి అతడి  బైక్ ను తన్నారు. అతని కింద పడిన తర్వాత హత్య చేయాలనేది వారి ప్లాన్. కానీ ఆ ప్రయత్నం విఫలమయింది.  ఒకసారి లిఫ్ట్ అడిగి, మరోసారి కారుతో ఢీకొట్టి, ఇలా వివిధ ప్రయత్నాలు చేసినా రాజేందర్ ను ఏమీ చేయలేకపోయారు. ఆ తర్వాత బీహార్లో రూ.లక్షన్నరతో పిస్తోలు కొన్న రాజు, దాంతో రెండుసార్లు  చంపేందుకు ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. చివరగా ఈ నెల 19న రవళి ఇంట్లో ఉన్నప్పుడే వారి ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న రాజేందర్ పై  రెండు రౌండ్లు కాల్పులు జరిపి హత్య చేశారు.

ఇదిలా ఉండగా,  సింగరేణి కాలరీస్ లో శనివారం కార్మికుడి హత్య జరిగింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్)లో కొరకొప్పుల రాజేందర్ గౌడ్ (28)  కార్మికుడిగా పనిచేస్తున్నారు. కొరకొప్పుల రాజేందర్ గౌడ్ శనివారం తెల్లవారుజామున గోదావరిఖనిలోని అతని నివాసంలో హత్యకు గురయ్యాడు. అతడిని గుర్తుతెలియని దుండగులు ఇద్దరు కాల్చి చంపారు. ఈ హత్య వెనుక కొరకొప్పుల రాజేందర్ గౌడ్ భార్య, ఆమె భర్త పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానించారు.

click me!