
అతను ఓ ఘరానా మోసగాడు. అతను చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావు. తనకు ఉన్న ఆంగ్ల భాష మీద పట్టుతో.. అందరినీ ఇట్టే బురిడీ కొట్టించేవాడు. పీఎంవో అడ్వైజర్ ని అంటూ అందరినీ నమ్మించేవాడు. కాగా ఈ అంతరాష్ట్ర ఘరానా మోసగాడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశాడు. ఈఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బీహార్‌కు చెందిన అతుల్ శర్మకు ఆంగ్లంపై మంచి పట్టు ఉంది. దీని ఆధారంగానే అనేక మందితో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. ప్రధానంగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌లో కనిపించే ప్రతి విషయాన్నీ నమ్మే వారినే ఎక్కువగా టార్గెట్ చేసేవాడు. తన పేరుతో సోషల్‌మీడియాలో వివిధ బ్లాగులు సృష్టించిన అతను ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశానని, ఆపై అమెరికాలోని మసచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఉన్నత చదువులు చదివినట్లు నమ్మించేవాడు.
దేశ ప్రధానికి సాంకేతిక సలహాదారుగా, తన పేరు జైవర్ధన్‌గా పరిచయం చేసుకున్న అతుల్ శర్మ 1998లో తొలిసారి గుజరాత్‌కు చెందిన వ్యక్తిని మోసం చేశారు. ఐక్యరాజ్యసమితికి సంబంధించిన కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ డబ్బు వసూలు చేయడంపై అప్పట్లో కేసు నమోదు చేసిన సీబీఐ అతడిని అరెస్టు చేసింది. పీఎంఓ అడ్వైజర్, నాసా మాజీ సైంటిస్ట్‌గా ప్రచారం చేసుకున్న అతుల్ శర్మ 2012 నుంచి జైలుకు వెళ్లి వస్తున్నాడు.
నాసా సైంటిస్ట్‌ను అంటూ అక్కడ ఓ మహిళను పరిచయం చేసుకున్న అతను అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో కలిసి దిగినట్లు మార్ఫింగ్ చేసిన ఫొటోలు చూపించాడు. ఆమె నుంచి రూ.20 లక్షలు తీసుకుని మోసం చేయడంతో కేసు నమోదు చేసిన ముంబైలోని ఓషివార పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. మీరట్‌కు చెందిన ఓ మహిళతోనూ ‘నాసా’ పేరు చెప్పి వివాహం చేసుకుని మోసం చేశాడు.
విషయం తెలుసుకున్న ఆమె నిలదీయగా ఆమెపై హత్యాయత్నం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులోనూ అతుల్ సింగ్ జైలుకు వెళ్ళి వచ్చాడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని బౌబజార్ ఠాణాతో పాటు మీరట్‌లోనూ ఇతడిపై చీటింగ్ కేసు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
అతుల్ శర్మకు ఢిల్లీ స్థాయిలో కొందరు పెద్దలతో పరిచయాలు ఉన్నాయి. పోలీసు అధికారులు, బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులతో స్నేహం చేసేవాడు. ఈ ముసుగులో వారి సహకారంతో కొన్ని పైరవీలు చేస్తుండటం వృత్తిగా మార్చుకున్నాడు. అయితే హఠాత్తుగా పీఎంఓ అడ్వైజర్ అవతారం ఎత్తిన అతుల్ సింగ్ ప్రధానమంత్రి స్థాయిలో పైరవీలు చేయిస్తానని ప్రచారం చేసుకునేవాడు.
ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులతో పాటు రక్షణ రంగానికి చెందిన వారికీ ఎర వేశాడు. తనకు ఉన్న పరిచయాలను వినియోగించి కొందరికి పైరవీలు చేసిపెట్టినా అనేక మంది నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేశాడు. రంగంలోకి దిగిన కేంద్ర నిఘా వర్గాలు అతుల్ శర్మ వ్యవహారం బట్టబయలు చేయడంతో లక్నోలో కేసు నమోదైంది. ఆ పోలీసులు ఈ మోసగాడిని అరెస్టు చేసి విచారించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని అబిడ్స్ ప్రాంతంలోనూ ఓ వ్యాపారిని మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
ఎట్టకేలకు తాజాగా ఈ మోసగాడిని హైదరాబాద్ లో పట్టుకోగా.. ఇతనికి సంబంధించిన సమచారాన్ని పోలీసులు బయటపెట్టేందుకు ఇష్టపడం లేదని తెలుస్తోంది.