నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయలేదని పగ.. స్నేహితుడి కొడుకు హత్య

Published : Sep 17, 2018, 12:35 PM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయలేదని పగ.. స్నేహితుడి కొడుకు హత్య

సారాంశం

తనకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయలేదని ఓ వ్యక్తి స్నేహితుడిపై కక్ష గట్టి అతని చిన్నారి కొడుకును అత్యంత దారుణంగా చంపాడు. 

తనకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయలేదని ఓ వ్యక్తి స్నేహితుడిపై కక్ష గట్టి అతని చిన్నారి కొడుకును అత్యంత దారుణంగా చంపాడు. వివరాల్లోకి వెళితే...  అసోంకి చెందిన రతుల్ సైఖియా హైదరాబాద్‌ మొయినాబాద్‌లోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు..

ఇతనికి జార్ఖండ్ నుంచి వచ్చిన మనీష్ ప్రీతితో పరిచయం ఏర్పడింది. కుటుంబంతో ఉపాధీ కోసం భార్య సింధూ దేవితో కలిసి హైదరాబాద్ వలస వచ్చిన మనీష్‌కు మొయినాబాద్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పని చూపించాడు. అలా వారి కుటుంబానికి బాగా దగ్గరయ్యాడు.

ఈ క్రమంలో వివాహం కానీ రతుల్‌కు సింధూదేవి బంధువైన ఓ అమ్మాయి బాగా నచ్చడంతో.. ఆమెతో పెళ్లి చేయమని మనీష్‌ను అడిగాడు. దీనికి అతను అంగీకరించలేదు. దీంతో రతుల్‌కి పట్టరాని ఆవేశం వచ్చినప్పటికీ లోపల దాచుకున్నాడు. ఈ క్రమంలో గత శనివారం సాయంత్రం రతుల్, మనీష్ ఇద్దరూ ఒక పని విషయమై బండ్లగూడ వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ మద్యం సేవించారు.

ఈ సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న మనీష్ కొడుకు ఆదిత్యను చూశాడు. తండ్రి లోపలికి వెళ్లిన తర్వాత ఆదిత్యను పిలిచి బిస్కెట్లు, చాక్లెట్లు కొనిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. అనంతరం నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి రాయితో చిన్నారి తలపై మోదాడు. రక్తమోడుతున్న బాలుడిని అజీజ్ నగర్‌లోని మరో ప్రాంతానికి లాక్కెళ్లి తీవ్రంగా కొట్టాడు. చిన్నారి చనిపోయినట్లు నిర్థారించుకున్న తర్వాత పక్కనే ఉన్న పొదల్లో పడేసి వెళ్లిపోయాడు.

తమ కుమారుడు కనిపించడం లేదని మనీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు చివరిసారిగా ఆదిత్యను తీసుకువెళ్లింది రతుల్ అని తెలుసుకుని అతన్ని తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టానికి తరలించి రతుల్‌ను కోర్టులో హాజరుపరిచారు.
 

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu