వర్కర్ హత్య చేస్తే.. గుండెపోటుగా చిత్రీకరించిన యాజమానులు.. గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని సొంతూరుకు తరలించి...

By SumaBala Bukka  |  First Published Nov 18, 2022, 11:39 AM IST

తోటి కార్మికుడిని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. దాన్ని దాచిపెట్టి గుండెపోటుగా చిత్రీకరించారు యజమానులు. విషయం బయటపడడంతో... 


హైదరాబాద్ : పనిచేసే చోట తరచూ యజమానికి ఫిర్యాదు చేస్తున్నాడని కక్ష పెంచుకున్నాడు. స్పానర్ తో తలపై మోది హత్య చేశాడు. పోలీసులకు తెలిస్తే ఇబ్బందులు వస్తాయని యజమానులు కూడా జాగ్రత్త పడ్డారు.  గుండెపోటుతో మరణించాడని చిత్రీకరించి, గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని సొంతూరికి సాగనంపారు. కిల్లర్ సినిమాను తలపించే ఈ హత్య కేసులో పహాడీషరీఫ్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. 

రాజస్థాన్ పాలి జిల్లా,  రాంపుర కాలా గ్రామానికి చెందిన  ఓం ప్రకాష్,  సునీల్ హైదరాబాద్ లో ఉంటూ మీర్ పేట  శ్రీరామ్ కాలనీలో శ్రీ సాన్వి ఇండస్ట్రీస్ ను నిర్వహిస్తున్నారు. ఇదే కంపెనీలో పాలి జిల్లా, జైతరణ్ కు చెందిన మహేంద్ర జీప్ చౌదరి (45), ఉత్తర్ ప్రదేశ్ కౌశాంబి జిల్లా చందుపురం రాయన్ కు చెందిన రోహిత్ కుమార్ పనిచేసేవారు.  అయితే, రోహిత్ సరిగ్గా పనిచేయడం లేదని తరచూ అతనిపై యజమానికి మహేంద్రజీ ఫిర్యాదు చేసేవాడు. 

Latest Videos

undefined

దీంతో మహేంద్ర పై కక్ష పెంచుకున్న రోహిత్ అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. పనిచేస్తున్న సమయంలో స్కానర్ తో మహేంద్ర తలపై మోదాడు.  దీంతో మహేంద్రజీ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలిసిన కంపెనీ యజమానులు పోలీసులకు సమాచారం అందించకుండా.. మహేంద్రజీని శివరాంపల్లిలోని చంద్రా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతిచెందాడు. 

కమలం గూటికి మరో టీఆర్ఎస్ నేత.. బీజేపీలో చేరనున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు..?

గుండెపోటు గా  చెప్పి..
అయితే, హత్య బయటికి పొక్కితే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన యజమానులు ఓంప్రకాష్, సునీల్ పథకం పన్నారు.  గుండెపోటుతో మరణించాడని ఆస్పత్రి నుంచే రోహిత్ తో   మహేంద్ర మామ ప్రకాష్ కు అక్టోబర్ 4న ఫోన్ చేయించారు. హాస్పిటల్ కి వచ్చి మృతదేహాన్ని తీసుకు వెళ్లాలని సూచించారు. హత్య సమాచారం పోలీసులకు అందించకుండా, మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించకుండా ఆస్పత్రి యాజమాన్యాన్ని మేనేజ్ చేశారు. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగేంత వరకు రోహిత్ నుఉత్తరప్రదేశ్ కు పంపించేశారు. 

గాయాలు కనిపించకుండా..
రోహిత్ సూచన మేరకు శివరాంపల్లిలోని ఆసుపత్రికి వచ్చిన ప్రకాష్ ఆంబులెన్స్ లో పూర్తిగా ప్యాక్ చేసి ఉన్న మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. తర్వాత మృతదేహాన్ని సొంతూరైన బాగియాడకు తీసుకువెళ్లారు. చివరి చూపు కోసం మహేంద్ర మృతదేహాన్ని తెరిచి చూసిన అతని కుమారుడు పాబురాంజీ జాఖర్ మృతుడి తల, శరీరం మీద బలమైన గాయాలు ఉన్నట్లు గుర్తించాడు. దీంతో తమ తండ్రి గుండెపోటుతో మరణించలేదని, ఎవరో హత్య చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్టోబర్ 31న రాజస్థాన్లోని జైతారామ్ ఠాణాలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు 
 
సీన్ రీ కన్స్ట్రక్షన్.. 
రాజస్థాన్ పోలీసులు కేసును పహాడీషరీఫ్ ఠాణాకు బదిలీ చేయడంతో రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ ఫ్యాక్టరీని సందర్శించి,  కార్మికులను విచారించారు. క్రైమ్ సీన్ ను రీ కన్స్ట్రక్షన్ చేశారు. రోహితే హంతకుడు అని తేల్చే కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. అయితే, హత్య కేసు సద్దుమణిగిందని భావించిన రోహిత్ ఈ నెల 14న యూపీ నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చి యధావిధిగా పనిలో చేరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గురువారం ఉదయం రోహిత్ ను అరెస్టు చేసి, విచారించగా.. మహేంద్రజీని తలపై స్పానర్ తో కొట్టి చంపినట్లు అంగీకరించాడు. ఫ్యాక్టరీ యజమానులు ఓం ప్రకాష్,  సునీల్ వ్యవహారం కూడా వెలుగులోకి రావడంతో.. ముగ్గురిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. హత్యకు ఉపయోగించిన స్పానర్ ను స్వాధీనం చేసుకున్నారు. 

click me!