
స్నేహితుడే కదా అని అప్పు ఇచ్చాడు.. ఎంతకీ తిరిగి ఇవ్వకపోవడంతో మాష్టర్ ప్లాన్ వేశాడు. స్నేహితుడి కి ప్రియురాలితో ఫోన్ చేయించాడు.. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీనగర్ కాలనీకి చెందిన కె అమర్‌నాథ్‌రెడ్డి సినీ పరిశ్రమలో మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం ఉదయం 9 గంటలకు అమర్‌నాథ్ మాదాపూర్‌లోని తన కార్యాలయానికి వెళుతున్నానని భార్య కల్పనకు చెప్పి ఇంట్లోంచి బయటకొచ్చాడు. 11 గంటల ప్రాంతంలో ఆయన్నుంచి కల్పనకు ఫోనొచ్చింది.
తనను కొంతమంది కిడ్నాప్ చేశారని, రూ. 4లక్షలు త్వరగా సమకూర్చి తన స్నేహితుడు ప్రదీప్ నటరాజన్‌కు ఇవ్వాల్సిందిగా కోరాడు. దీంతో ఆమె సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిందితులకు కల్పనతో ఫోన్ చేయించి డబ్బు తీసుకునేందుకు శ్రీనగర్‌కాలనీకి రావాలని చెప్పించారు. డబ్బు తీసుకునేందుకు వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
మిగతా ముగ్గురు నిందితులను నల్లగొండ సమీపంలో అరెస్టు చేశారు. బాధితుడు అమర్‌నాథ్‌రెడ్డికి ప్రదీప్ నటరాజన్ స్నేహితుడు. వెంకటేశం అనే రియల్టర్ గతంలో బెంగళూరుకు చెందిన జునైద్ అనే వ్యక్తికి వ్యాపార నిమిత్తం రూ. 13.5 లక్షలు ఇచ్చాడు. అతడు ఆ డబ్బును తరిగి ఇవ్వకపోవడంతో వసూలు చేయించి ఇవ్వాలని జువైద్‌తో సన్నిహితంగా ఉండే అమర్‌నాథ్‌కు ప్రదీప్ చెప్పాడు.
బెంగుళూరు వెళ్లిన అమర్‌నాథ్ అక్కడ జునైద్‌పై మోసం కేసు పెట్టాడు. దిగొచ్చిన అతడు రూ. 10 లక్షలను అమర్‌నాథ్‌కు ఇచ్చాడు. అయితే ఒప్పందంలో భాగంగా తమకు ఇవ్వాల్సిన రూ. 4 లక్షల గురించి నటరాజన్ తరచు ఫోన్‌చేస్తున్నా అమర్‌నాథ్ స్పందించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో అతడిని కిడ్నాప్ చేసైనా డబ్బు వసూలు చేసుకోవాలని ప్రదీప్ నిర్ణయించుకున్నాడు. తన ప్రియురాలు చెన్నైకి చెందిన కీర్తన అలియాస్ మధు (25)ను పావుగా వాడుకున్నాడు. పథకం ప్రకారం కీర్తన ఫోన్ చేసి.. లొకేషన్ షేర్ చేసి అత్యవసరంగా కలవాలని కోరడంతో వెళ్లిన అమర్‌నాథ్ రెడ్డిపై నిందితులు దాడి చేసి కిడ్నాప్‌చేశారు.. కాగా ప్రదీప్, కీర్తన పరారీలో ఉన్నారు.