ఏడేళ్ల బాలుడు, బాలికపై అత్యాచారం, లైంగికవేధింపులు.. కామాంధుడికి 30యేళ్ల కఠిన కారాగారశిక్ష

By SumaBala BukkaFirst Published Oct 1, 2022, 6:55 AM IST
Highlights

కామంతో కళ్లు మూసుకుపోయిన ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం... మరో ఏడేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేశాడో రాక్షసుడు. అతనికి రంగారెడ్డి జిల్లా కోర్టు 30 యేళ్ల కఠిన కారాగారశిక్ష, జరిమానా విధించింది. 

రంగారెడ్డి జిల్లా : కామంతో  కళ్ళు  మూసుకుపోయి ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం,  మరో ఏడేళ్ల బాబు పై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం రెండు కేసుల్లో కలిపి 30 ఏళ్ల కఠిన కారాగారశిక్ష రూ.13.000 జరిమానా విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంగర రాజిరెడ్డి కథనం ప్రకారం.. నిందితుడు సుశీల్ కుమార్ సింగ్ (35)  రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని కాటేదాన్ లో ఫుడ్ ప్రోడక్ట్ కంపెనీకి అనుబంధం నివాస గృహ సముదాయంలో ఉండేవాడు.  అతడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.  వీరు మాత్రం బీహార్లోని సొంతూరులో ఉంటున్నారు.  ఒంటరిగా ఉన్న అతను తాగుడు, ఇతర చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. ఈ గ్రామంలో 2019 మే 4న వంటరిగా కనిపించిన చిన్నారి (7)ని సమోసా ఇప్పిస్తానని ఆశ చూపి బుద్వేల్ రైల్వే స్టేషన్ సమీపం లోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి పరారయ్యాడు.

మైలార్ దేవులపల్లి పోలీసులు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సమగ్ర దర్యాప్తు తరువాత కోర్టులో నిందితుడిపై పోక్సో చట్టం కింద అభియోగ పత్రాలు దాఖలు చేశారు. కేసు విచారించిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి ఆర్ తిరుపతి నిందితుడికి 20 ఏళ్ల జైలు..రూ.10వేల  జరిమానా విధించారు.  దీంతోపాటు బాధిత చిన్నారికి రూ. 5 లక్షల నష్టపరిహారం మంజూరు చేయాలంటూ జిల్లా న్యాయసేవాధికార సంస్థకు సిఫార్సు చేశారు.

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి 20యేళ్ల జైలుశిక్ష..

ఈ ఘటనకు ముందు  2019 ఏప్రిల్ 29న నిందితుడు సుశీల్ కుమార్ సింగ్ ఓ బాలుడి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. రాజేంద్రనగర్ మండలం లో ఓ మైదానంలో ఆడుకుంటున్న బాలుడు (7)కి  రేగి పళ్ళు కొని ఇస్తానని ఆశ చూపి.. సమీపంలోని స్మశాన వాటికకు తీసుకువెళ్లి అమానుషంగా లైంగికదాడి చేశాడు. మైలార్ దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు.  ఆ తర్వాత సమగ్ర దర్యాప్తు చేసిన పోలీసులు  సాంకేతిక,  వైద్య ఆధారాలతో కూడిన అభియోగ పత్రాన్ని కోర్టులో దాఖలు చేశారు.  ఈ కేసులో న్యాయమూర్తి తిరుపతి నిందితుడికి  పదేళ్ల జైలు రూ. 3000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. 

click me!