శంషాబాద్ బతుకమ్మ వేడుకల్లో కవిత.. చెప్పా పెట్టకుండా వచ్చిన తమిళిసై, అంతా షాక్ (వీడియో)

By Siva KodatiFirst Published Sep 30, 2022, 9:52 PM IST
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షాకిచ్చారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ . శంషాబాద్‌లోని అమ్మపల్లి సీతారామ స్వామి ఆలయానికి ఆమె ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వచ్చారు. 

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి షాకిచ్చారు. అది కూడా ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వూరు, వాడా, చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రతిఒక్కరూ బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. ఇక బతుకమ్మ అనగానే గుర్తొచ్చే కవిత కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పండుగ జరుపుకుంటూ ప్రజలను ఉత్సాహపరుస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం శంషాబాద్‌లోని ప్రఖ్యాత అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయంలో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించారు కవిత. 

 

 

ఈ సందర్భంగా అమెరికన్ కాన్సూలేట్ జనరల్ జెన్నీఫర్ లార్డాన్, కవిత కలిసి బతుకమ్మను పేర్చి ఆడి పాడారు. అనంతరం లార్డాన్‌తో కలిసి ఆమె రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సరిగ్గా అప్పుడే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గవర్నర్ అక్కడికి రావడంతో ఎమ్మెల్సీ కవితతో పాటు అధికారులు షాక్‌కు గురయ్యారు. ఆలయంలో కవితను అప్యాయంగా పలకరించారు తమిళిసై . పూజా అనంతరం గవర్నర్ అక్కడి నుంచి రాజ్‌భవన్‌కి వెళ్లిపోయారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న తమిళిసై నేరుగా ఆలయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కవితతో గవర్నర్ మాట్లాడుతోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

 

అంతకుముందు .. మీర్‌పేట పరిధిలోని టి.కె.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బాల గంగాధర తిలక్ స్పూర్తితో తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు.  బాల గంగాధర తిలక్ తన ఇన్సపిరేషన్ అన్న కవిత.. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన పోరాడారని గుర్తుచేశారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించి, ప్రజలను ఒక దగ్గర చేర్చి, స్వాతంత్ర్యం కోసం ఎందుకు కొట్లాడాలో బాల గంగాధర తిలక్ ప్రజలకు వివరించే వారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. దాన్ని స్టడీ చేసిన తర్వాత, తెలంగాణలో ఇలా ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చి, ఉద్యమ సమయంలో బతుకమ్మ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు . పూలనే దేవుడిగా పూజించే బతుకమ్మ లాంటి పండుగ ప్రపంచంలో తెలంగాణలో తప్ప మరేక్కడా లేదని ఆమె అన్నారు. 

 

 

click me!