
ఖమ్మం : ఖమ్మంలో దారుణం జరిగింది. కామవాంఛతో ఓ దుర్మార్గుడు నాలుగేళ్ల చిన్నారిని చిదిమేశాడు. ఈ కేసులో నిందితుడికి కోర్టు 20యేళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది.
నాలుగేళ్ల పసిపాపపై పాశవికంగా లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు పింగళి గణేశ్ అలియాస్ చింటూకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పి. చంద్రశేఖరప్రసాద్ సోమవారం తీర్పు చెప్పారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాు చెందిన పింగళ గణేశ్ (20) తన గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. 2020 నవంబర్ 19న చాక్లెట్ కొనుక్కునేందుకు వచ్చిన బాలిక (4)ను ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఏడుస్తుండగా తల్లిదండ్రులు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోక్సో చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిమీద మోపిన అభియోగం రుజువు కావడంతో న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.