
హైదరాబాద్ : ‘ఐయామ్ సో బ్యాడ్ డాటర్... మిస్ యూ నాన్న... అమ్మ’ అని సూసైడ్ నోట్ రాసి... హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంటెక్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన రఘుశాల లచ్చయ్య, రజిత దంపతుల కుమార్తె ఆర్.మౌనిక (27) హెచ్ సీయూలో ఎంటెక్-నానో టెక్నాలజీ రెండో సంవత్సరం చదువుతోంది.
క్యాంపస్ లోని మహిళా వసతి గృహం-7లో ఉంటోంది. సోమవారం ఉదయం నుంచి గదిలోంచి బయటకు రాలేదు. తోటి విద్యార్థులు వెళ్లి పిలిచినా స్పందన లేదు. వెంటిలేటర్ లోంచి చూడగా కిటిక చువ్వకు ఉరివేసుకుని కనిపించింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఎంటెక్ విద్యార్థులను క్యాంపస్ లోకి అనుమతించడంతో ఈ నెల 18వ తేదీన హాస్టల్ గదికి వచ్చి ఉంటోంది.
ఆమె తండ్రి లచ్చయ్య గ్రామంలోనే వ్యవసాయం చేస్తుంటారు. పదో తరగతి వరకు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన తర్వాత మౌనికకు బాసర ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. అక్కడ ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని హెచ్ సీయూలో ఎంటెక్ చదువుతోంది.