భార్య పుట్టింట్లోనే వుండటంతో తీవ్ర మనస్థాపానికి గురయిన భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ : భార్య ఎక్కడ తనకు దూరమవుతుందోనని తీవ్ర మనస్థాపానికి గురయిన భర్త దారుణ నిర్ణయం తీసుకున్నాడు. భార్య పుట్టింటికి వెళ్ళగా ఇంట్లో ఒంటరిగా వున్న భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని ఫిలింనగర్ దుర్గాభవానీ నగర్ కు చెందిన నర్సింహకు శివానితో రెండేళ్లక్రితం వివాహం అయ్యింది. మొదట్లో సాఫీగా సాగిన వీరి సంసారజీవితంలో కొంతకాలంగా అలజడి రేగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్దలు మొదలై చివరకు శివానీ పుట్టింటికి వెళ్లిపోయే స్థాయికి చేరాయి. భర్తతో పాటు అత్తింటివారి తీరునచ్చని శివాని నాలుగురోజుల క్రితం తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది.
ప్రస్తుతం పుట్టింట్లో వుంటున్న భార్యకు నచ్చజెప్పడానికి నర్సింహ ఎంతో ప్రయత్నించాడు. భార్యకు ఫోన్ చేసి తాను మాట్లాడటమే కాదు తల్లితో కూడా మాట్లాడించాడు. అయితే వారితో మాట్లాడేందుకే ఇష్టపడని శివానీ తిరిగి అత్తవారింటికి వెళ్లేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఈ దూరం ఇలాగే కొనసాగి భార్య ఎక్కడ తనకు శాశ్వతంగా దూరమవుతుందోనని నర్సింహ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన అతడు నిన్న(ఆదివారం) దారుణానికి ఒడిగట్టాడు.
Read More వీడిన రిటైర్డ్ ఎంపీడీవో హత్య కేసు మిస్టరీ.. అడ్డొస్తున్నాడని సుపారీ ఇచ్చి , వెలుగులోకి కీలక విషయాలు
ఇంట్లో ఎవరూలేని సమయంలో నర్సింహ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు అది గమనించే సమయానికి అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కొడుకు మృతదేహాన్న పట్టుకుని ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నర్సింహ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)