
భర్త రోజూ కల్లుతాగి.. దానికి బానిసగా మారిపోతున్నాడనే కోపంతో భార్య పుట్టింటికి వెళ్లింది. అయితే.. భార్య పుట్టింటికి వెళ్లడాన్ని తట్టుకోలేకపోయిన భర్త చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హసన్ నగర్ కు చెందిన సయ్యద్ షఫీ(30) వృత్తి రిత్యా ట్యాక్సీ డ్రైవర్. మూడేళ్ల క్రితం దుబాయి వెళ్లాడు. కరోనా కాలంలో అక్కడే ఇరుక్కుపోయాడు. మూడు నెలల క్రితం స్వదేశానికి వచ్చేశాడు. ఈ క్రమంలో కల్లు తాగడం అలవాటు చేసుకున్నాడు. దానికి బానిసగా మారిపోయాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.
రోజు ఇలా కల్లుతాగడం విషయంలో భార్యభర్తల మధ్య పలు మార్లు గొడవలు కూడా జరిగాయి. అయినా అతనిలో మార్పు రాలేదు. దీంతో.. భర్తలో మార్పురావడం లేదని భార్య పుట్టింటికి వెళ్లింది.
కాగా.. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఫీలై.. ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీ కి తరలించారు.