తెలంగాణ ఫైటర్ కొల్లూరి చిరంజీవి కన్నుమూత

By telugu teamFirst Published Mar 8, 2021, 7:11 AM IST
Highlights

తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన బిఎస్పీలో కూడా పనిచేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమ వీరుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి కన్నుమూశారు తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. డాక్టర్ చిరంజీవి కొల్లూరి వయస్సు 74 ఏళ్లు. గత కొంత కాలంగా అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఎఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన రాత్రి 1:30 గంటలకు తుది శ్వాస విడిచారు.

ఆయన కుటుంబం ఆస్పత్రి ఖర్చులు భరించలేని స్థితిలో ఉందని తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్  సీఎం అత్యవసర నిధి నుంచి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసి రాష్ట్ర ప్రభుత్వ సహాయాన్ని అందజేశారు. డాక్టర్ చిరంజీవి ని రక్షించడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

1947 ఫిబ్రవరి లో చిరంజీవి వరంగల్ లో జన్మించారు. తల్లి టీచర్, తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి  సంఘం నేతగా చురుకుగా పని చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా కీలకపాత్ర పోషించిన డాక్టర్ చిరంజీవి ఆ తర్వాత  పీపుల్స్ వార్ గ్రూప్ (ఇప్పటి మావోయిస్టు పార్టీ)లో పని చేశారు. కొండపల్లి సీతారామయ్యతో పాటు పనిచేశారు.

1977 లో పీపుల్స్ వార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్నారు. ఆ తర్వాత బిఎస్పీలో చేరి ఆ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాంకు చేరువయ్యారు. రాష్ట్రంలో బిఎస్పీని బలోపేతం చేయడమే కాకుండా ఆ పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దేశ వ్యాప్తంగా తిరిగారు. కాన్షీరాం ఉపన్యాసాలనుస పార్టీ సిద్ధాంతాన్ని తెలుగు లోకి అనువదించారు. 'బహుజన పత్రిక' కు ఎడిటర్ గా పని చేశారు.

click me!