నిన్ను చూడాలని వుంది తల్లీ... ఓసారి వచ్చిపోరా..: విదేశాల్లోని కూతురికి ఫోన్ చేసి తండ్రి సూసైడ్

Published : Aug 30, 2023, 03:31 PM ISTUpdated : Aug 30, 2023, 04:22 PM IST
నిన్ను చూడాలని వుంది తల్లీ... ఓసారి వచ్చిపోరా..: విదేశాల్లోని కూతురికి ఫోన్ చేసి తండ్రి సూసైడ్

సారాంశం

 విదేశాల్లో వుంటున్న కూతుర్ని చూడాలని వుందంటూ ఇంటికి పిలిచి ఆమె వచ్చేసరికే ఆత్మహత్య చేసుకున్నాడో తండ్రి. ఈ హృదయవిధారక ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. 

జనగామ : తలకు మించిన భారమైనా కూతురు భవిష్యత్ బావుంటుందని ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించాడో తండ్రి. ఆ అప్పులు తీర్చడం ఎలాగో తెలియక సతమతం అవుతుండగానే భార్య అనారోగ్యం పాలయ్యింది. ఆమె వైద్యం కోసం మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. ఇలా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో తీవ్ర ఆందోళనకు గురయిన అతడు ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు. తనను కడసారి చూసేందుకు రావాలంటూ విదేశాల్లోని కూతురికి ఫోన్ చేసి ఓ తండ్రి సూసైడ్ చేసుకున్న హృదయవిధారక ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామానికి చెందిన భగవాన్ రెడ్డి, మంగాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. కూతురు సౌమికా రెడ్డిని ఉన్నత చదువుల కోసం లండన్ కు వెళ్లగా కొడుకు ఇక్కడే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. పిల్లల భవిష్యత్ బాగుండాలని అందరు తల్లిదండ్రులు తాపత్రయపడినట్లే భగవాన్ రెడ్డి కూడా కోరుకున్నాడు. అందుకోసమే ఆర్థిక స్తోమత లేకున్నా అప్పులు చేసిమరీ కూతుర్ని విదేశాలకు పంపించాడు. 

గతేడాది కూతురు ఉన్నతచదువుల కోసం చేసిన అప్పులకు వడ్డీ పెరిగిపోతుండటంతో భగవాన్ రెడ్డి ఆందోళనకు గురయ్యాడు. దీనిక తోడు ఇటీవల భార్య అనారోగ్యానికి గురవడంతో వైద్యం కోసం మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. ఇలా అప్పులేమో పెరిగిపోవడం... అవి తీర్చే మార్గం లేకపోవడంతో అతడి ఆందోళన రెట్టింపయ్యింది. ఈ ఒత్తిడి తట్టుకోలేకపోయిన భగవాన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. 

Read More  గుండెలు పిండేసే ఘటన... అన్న మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లి

లండన్ లో వున్న కూతురికి రెండ్రోజుల క్రితమే ఫోన్ చేసిన భగవాన్ రెడ్డి తన ఆర్థిక కష్టాల గురించి చెప్పి బాధపడ్డాడు. ఓసారి చూడాలని వుందంటూ కూతుర్ని ఇండియాకు రావాలని కోరాడు. దీంతో వెంటనే బయలుదేరిన ఆమె మంగళవారం ఉదయానికి హైదరాబాద్ కు చేరుకుంది. ఈ విషయాన్ని తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. మరికొద్ది గంటల్లో కూతురు ఇంటికి చేరుకుంటుందనగా భగవాన్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఇంట్లో ఎవరూ లేని సమయంలో భగవాన్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు ఇంటికి చేరుకునేసరికి కొన ఊపిరితో పడివున్నాడు. వెంటనే అతడిని జనగామ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇంటికి వచ్చిన కూతురు తండ్రి మృతదేహాన్ని పట్టుకుని రోదించడం అక్కడున్నవారితో కన్నీరు పెట్టించింది. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుడి తండ్రి రాజిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు.  

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)
 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!