
హైదరాబాద్ నగరం నడిబొడ్డున దారుణం జరిగింది. శనివారం రాత్రి పంజాగుట్ట మెట్రో స్టేషన్ సమీపంలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. ఏకంగా 15 మంది యువకులు.. ఓ యువకుడిపై దాడి చేస్తూ.. వీరంగం సృష్టించారు. ఈ సమయంలో రోడ్డుపై వెళుతున్న వాహనదారులతో పాటు స్థానికులు అడ్డుకుని యువకుడిని రక్షించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివారల్లోకి వెళ్తే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఐ జయరామ్ అనే వ్యక్తి తన స్నేహితులు కౌశిక్, అభిలాష్‌లతో కలిసి దేవరగట్ శ్రీరామ్ అనే వ్యక్తిని కలవడానికి పంజాగుట్ట మెట్రో స్టేషన్ ప్రాంతానికి వచ్చారు. శ్రీరామ్.. జయరామ్‌కు తరచుగా ఫోన్‌లో కాల్ చేసి తనను కలవమని అడిగాడని తెలుస్తోంది. పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర జయరామ్, తన ఇద్దరు స్నేహితులతో కలవడానికి వెళ్లినప్పుడు శ్రీరామ్‌తో పాటు మరో 15 మంది వ్యక్తులు ముగ్గురిపై దాడి చేశారు.
ఈ క్రమంలో జయరామ్ ను బలవంతంగా కారులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ సి హరిశ్‌చంద్రారెడ్డి తెలిపారు. గత కొన్ని నెలలుగా శ్రీరాములు, జయరామ్‌ల మధ్య కొన్ని ఆర్థిక సమస్యలపై విభేదాలున్నాయని పోలీసులు తెలిపారు. గొడవను గమనించిన పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గుంపును చెదరగొట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.