
సికింద్రాబాద్: సమాచారం కోసం వినియోగించే సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయి. వాట్సప్, ఫేస్ బుక్ లకు ప్రజలు ముఖ్యంగా యువత బానిసలుగా మారిపోతున్నారు. వాట్సప్, ఫేస్ బుక్ ఛాటింగ్ ఉంటే చాలు ప్రపంచాన్నే మరచిపోతున్నారు. ఇవే సోషల్ మీడియా కొందరి ప్రాణాలను కూడా బలితీసుకుంటుంది.
సికింద్రాబాద్ కు చెందిన శివకుమార్ వాట్సప్ ఛాటింగ్ కు బానిస అయిపోయాడు. నిత్యం వాట్సప్ లోనే మునిగిపోతుండేవాడు. కనీసం చుట్టూ ఎవరు ఉన్నారన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా వాట్సప్ ఛాటింగ్ లోనే లీనమైపోయేవాడు. నిత్యం ఛాటింగ్ లోనే ఉండటంతో భార్య మందలించింది. వాట్సప్ ఛాటింగ్ ఆపాలని లేకపోతే కుటుంబ సభ్యులకు చెప్తానని హెచ్చరించింది.
భార్య హెచ్చరించడంతో మనస్థాపానికి గురైన శివకుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఆగష్టు 15న శివకుమార్ కు వివాహమైనట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కనీసం భార్యకు కానీ కుటుంబ సభ్యులకు కానీ సమయం కేటాయించకుండా వాట్సప్ లోనే ఉండటంతో భార్య మందలించిందని తెలిపారు.