కేసీఆర్ సారూ.. మమ్మల్ని తెలంగాణలో కలపండి

First Published May 22, 2018, 10:11 AM IST
Highlights

రైతు బంధు పథకం పట్ల ఆకర్షితులైన మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు విచిత్రమైన విజ్ఞప్తి చేశారు.

ముంబై : రైతు బంధు పథకం పట్ల ఆకర్షితులైన మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు విచిత్రమైన విజ్ఞప్తి చేశారు. తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని వారు కోరారు. ఈ మేరకు వారు కేసిఆర్ కు ఓ లేఖ రాశారు.

దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రైతులకు పెట్టుబడి కోసం ఏడాదికి ఎకరాకు 8 వేల రూపాయల చొప్పున అందిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రయోజం పొందడానికి వీలుగా తమ తాలుకాలోని గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని నాందేడ్‌ జిల్లాలోని ధర్మాబాద్‌ తాలుకా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు టీఆర్‌ఎస్‌ ఎంపీ కవితను కోరినట్లు తెలుస్తోంది.

నిజామాబాద్‌లో రైతు బంధు చెక్కులను పంపిణీ చేస్తున్న ఎంపీ కవితను బాబ్లీ గ్రామ సర్పంచ్‌ కలిశారు. తమ సమస్యలను ఆమెకు వివరించారు. ఒక రాష్ట్రంలోని గ్రామాలను మరో రాష్ట్రంలో కలపడం అంత సులభమైన విషయం కాదని తమకు తెలుసునని, అయితే ఇటువంటి పథకాల ద్వారా ప్రయోజనం పొందడానికి మరో మార్గం లేదని ఆయన అన్నారు.

రైతుల రుణమాఫీ, వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ సరఫరా, రైతులకు 5 లక్షల జీవిత బీమా వంటి పథకాలు కూడా వారిని ఆకర్షించినట్లు చెబుతున్నారు.

click me!