నేను గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.. నామా

First Published May 22, 2018, 10:09 AM IST
Highlights

మిని మహానాడులో నామా నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్య

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగు దేశం జెండా ఎగరాలని, సమష్టిగా శ్రమిస్తే విజయం మనదేనని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగానే పొత్తులు ఉంటాయని, ఈఏడాది పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా కృషి సాగిద్దామని పిలుపునిచ్చారు..

టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య అధ్యక్షతన స్ధానిక హరిత గార్డెన్స్‌లో ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నామ నాగేశ్వరరావు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీనవర్గాల పార్టీ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల కోసం పలు పార్టీలు అడుగుతున్నాయని, కార్యకర్తల అభిప్రాయం మేరకే ఉంటాయన్నారు.

పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిదే తుది నిర్ణయమని, ఈ ఏడాదికాలంలో కిందిస్థాయిలో పార్టీ పటిష్ఠానికి శ్రమించి పనిచేయాలని, మనం బలంగా ఉంటే అన్ని పార్టీలు పొత్తుకోసం మన వద్దకే వస్తాయని అన్నారు. గతంలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే గ్రామపంచాయతీలో అత్యధిక స్ధానాలు టీడీపీ గెలుచుకున్న చరిత్ర ఉందని, అదే ట్రెండ్‌ ఈసారి కూడా కొనసాగించాలని సూచించారు. ‘గత లోక్‌సభ ఎన్నికల్లో కొద్ది ఓట్లతో నేను ఓడిపోయా... నేను ఓడినందుకు నా కంటే మీరే ఎక్కువ బాధపడ్డారు, నేను గెలిచి ఉంటే పార్టీతోపాటు ఖమ్మం జిల్లా అభివృద్ధి మరింతగా జరిగి ఉండేదని’ నామ అన్నారు.

click me!