కుంగిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ: కుట్రకోణంపై ఫిర్యాదు, కేసు నమోదు

By narsimha lodeFirst Published Oct 24, 2023, 2:22 PM IST
Highlights

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేశారు. కుట్రకోణంపై పోలీసులు దర్యాప్తు నిర్వహించనున్నారు. 

భూపాలపల్లి: భూపాలపల్లి: మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ కుంగిపోయిన ఘటనపై  ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరిగేషన్ శాఖ ఏఈఈ రవికాంత్ ఫిర్యాదు మేరకు మహాదేవ్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.  మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ కుంగిపోయిన ఘటనపై విద్రోహ శక్తులున్నాయా అనే కోణంలో  పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.

ఈ నెల  21న సాయంత్రం పెద్ద శబ్దంతో పిల్లర్లు కుంగిపోయినట్టుగా  నీటిపారుదల శాఖ ఏఈఈ రవికాంత్  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.   19,20, 21 పిల్లర్లు కుంగిపోయినట్టుగా ఆ ఫిర్యాదులో రవికాంత్ చెప్పారు.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు  లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు  కుంగిపోవడం వెనుక విద్రోహశక్తుల ప్రమేయం ఉందనే  అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.ఈ విషయమై దర్యాప్తు చేయాలని కోరారు.

ఇరిగేషన్ శాఖకు చెందిన ఫిర్యాదు అందినట్టుగా  భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే చెప్పారు.  ఈ ఘటన  వెనుక మావోయిస్టుల ప్రమేయం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారనే విషయమై ఆరా తీస్తున్నట్టుగా  పోలీసులు ప్రకటించారు.  పీడీపీపీ సెక్షన్ కు చెందిన మూడు సెక్షన్లతో ఐపీసీ 427 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 

also read:కుంగిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ: పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీమ్

మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీకి చెందిన పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై  కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ సీరియస్ గా తీసుకుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని  కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ పంపింది.ఈ విషయమై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.దీంతో  అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందాన్ని రాష్ట్రానికి పంపింది  కేంద్రం. ఈ నెల  24న  అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది.  కుంగిన పిల్లర్లను పరిశీలించింది. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ ఇంజనీర్లతో  చర్చించింది. మధ్యాహ్న భోజనం తర్వాత  హైద్రాబాద్ కు  జైన్ బృందం తిరిగి వెళ్లనుంది.  

లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.  కేసీఆర్ సర్కార్ అవినీతికి  లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనను నిదర్శనంగా  పేర్కొంటున్నాయి.  ఇదిలా ఉంటే  లక్ష్మీబ్యారేజీ వద్ద పోలీసులు  144 సెక్షన్ విధించారు.  ఈ ప్రాంతంలోకి ఎవరిని అనుమతించడం లేదు. బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో  బ్యారేజీలోని 10 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. 

click me!