మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ టికెట్ కోసం ముదిరాజ్ నేతల మధ్య వార్.. టికెట్ నీదా? నాదా?

By Mahesh K  |  First Published Sep 23, 2023, 4:24 PM IST

మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ టికెట్ కోసం ఆశావాహుల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో ముదిరాజ్ జనాభా గణనీయంగా ఉన్నది. దీంతో ఈ సామాజిక వర్గ నేతలకు టికెట్ వచ్చే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. ఈ తరుణంలోనే ఈ సామాజిక వర్గానికి చెందిన సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేశ్ ముదిరాజ్‌ల మధ్య  టికెట్ వార్ ప్రారంభమైనట్టు తెలిసింది.
 


హైదరాబాద్: మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ టికెట్ కోసం స్థానికంగా తీవ్ర పోటీ నెలకొంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గం నిర్ణయాత్మకంగా ఉన్నది. సుమారు 50 వేల మంది గల ఈ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ముఖ్య నేతల మధ్య టికెట్ వార్ జరుగుతున్నది.  టికెట్ నీదా? నాదా? అనే స్థాయిలో ఈ పోరు ఉన్నట్టు తెలుస్తున్నది.

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. రెండు సార్లు గెలిచిన ఆయనకు కూడా బలమైన మద్దతు ఉన్నది. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డిని ఎదుర్కొనే సమవుజ్జీల కోసం కాంగ్రెస్ చూస్తున్నది. శ్రీనివాస్ రెడ్డిని ఢీకొట్టే అభ్యర్థిని బరిలో నిలుపాలని ఆలోచిస్తున్నది. ఈ తరుణంలోనే మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ టికెట్ కోసం ఇప్పటికే సీనియర్ నేత ఉబేదుల్లా కోత్వాల్, ఎన్పీ వెంకటేశ్ ముదిరాజ్, సంజీవ్ ముదిరాజ్, వినోద్ కుమార్, బెక్కరి అనిత, రాఘవేంద్ర రాజులతోపాటు మరొకరు దరఖాస్తు చేశారు. కాగా, టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో టికెట్ ఎవరికి వస్తుందనే ఆలోచనలు నిత్యం చేస్తున్నారు. 

Latest Videos

మహబూబ్ నగర్ నియోజకవర్గంలో సుమారు 50 వేల మంది ముదిరాజ్ కులస్తులు ఉన్నారు. దీంతో ఈ వర్గానికి చెందిన నాయకుడికి టికెట్ ఇస్తే ఈ సామాజిక ఓట్లు కొల్లగొట్టే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది.  ఇక్కడ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఇద్దరు నేతలు సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేశ్ ముదిరాజ్‌లు ఉన్నారు. పై ఈక్వేషన్ కారణంగా టికెట్ తమకే వస్తుందని ఇద్దరూ భరోసాతో ఉన్నారు.

Also Read: ఈ నెల 30న తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ.. వివరాలు ఇవే..!

సంజీవ్ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతతో పని చేస్తున్నారు. ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారు. కష్టకాలంలోనూ పార్టీ జెండా ఎత్తిపట్టుకున్నారు. వివాదరహితుడిగా పేరు ఉన్నది. కాగా, ఎన్పీ వెంకటేశ్ క్రిమినల్ లాయర్‌, గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారి, మళ్లీ హస్తం గూటికి వచ్చారు. వచ్చిన వెంటనే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పార్టీని వీడి మళ్లీ వచ్చి టికెట్ దరఖాస్తు చేసుకోవడం సీనియర్ నేతలకు మింగుడు పడటం లేదు. పార్టీని నమ్ముకుని కష్టకాలంలోనూ పార్టీ వెంటే నడిచిన తమను కాదని మొన్నటిదాకా ప్రత్యర్థి పార్టీలో ఉండి ఇప్పుడు హస్తం కండువా కప్పుకున్న నేతకు టికెట్ ఇస్తే ఎలా అని సీనియర్ నేతలు అధిష్టానం వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.

సంజీవ్ ముదిరాజ్ సీనియర్ నేత, వివాదరహితుడు, కానీ, పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకోలేదని, ఇదే ఆయనకు ఇబ్బందిగా మారినట్టు సమాచారం. కాగా, వెంకటేశ్ వృత్తిరీత్యా క్రిమినల్ కేసులు వాదిస్తూ మంచిపేరు సంపాదించారు. నియోజకవర్గం వ్యాప్తంగా మంచి పరిచయాలు ఉన్నాయి. అందుకే తనకు పార్టీ టికెట్ ఇస్తే సత్తా చూపిస్తానని వెంకటేశ్ అధిష్టానానికి నివేదించినట్టు సమాచారం. అయితే, వీరిద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలా? అనే విషయంపై అధిష్టానం తేల్చుకోలేకపోతున్నట్టూ చెబుతున్నారు. అయితే, వీరిద్దరి మధ్య త్వరలోనే సయోధ్య కుదిర్చుతారనే ప్రచారం సాగుతున్నది.

click me!