వీడెవడండీ బాబు ... రూ.2 కోట్ల కోసం రూ.4 కోట్ల స్పోర్ట్ కారును కాల్చేసాడా..! 

By Arun Kumar PFirst Published Apr 16, 2024, 1:04 PM IST
Highlights

ఖరీదైన లాంబోర్ఘిని స్పోర్ట్స్ కారు మంటల్లో కాలిబూడిదైన ఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది. రూ.2 కోట్ల కోసం ఏకంగా రూ.4 కోట్ల విలువైన కారును కాల్చేసారు. 

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది.ఏకంగా రూ.4 కోట్ల విలువైన లాంబోర్ఘిని కారును నడిరోడ్డుపై కాల్చేసిన ఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది. రూ 2 కోట్ల అప్పు చెల్లించడంలేదన్న కోపంతో ఏకంగా రూ.4 కోట్ల ఖరీదైన స్పోర్ట్స్ కారుకు నిప్పుపెట్టారు. ఇంత ఖరీదైన కారు నిప్పులపాలవుతుండగా ఎవరో వీడియోతీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో మూడ్రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.  

అసలేం జరిగింది : 

హైదరాబాద్ లోని నార్సింగి ప్రాంతంతో నివాసముండే నీరజ్ వ్యాపారి. అతడి వద్ద రూ.4 కోట్ల విలువైన లాంబోర్ఘిని స్పోర్ట్స్ కారు వుంది. అయితే అతడు ఈ కారును అమ్మేయాలని నిర్ణయించుకుని ఈ విషయాన్ని అయాన్ అనే వ్యక్తికి చెప్పాడు. బాగా పరిచయం వున్న వ్యక్తి కావడంతో కోట్ల విలువచేసే కారును అమ్మిపెట్టే బాధ్యతను అయాన్ కు అప్పగించాడు నీరజ్. 

లాంబోర్ఘిని కారు ఫోటోలతో పాటు వివరాలను సెకండ్ హ్యాండ్ కార్ల క్రయవిక్రయాలు చేపట్టే అయాన్ హైదర్ కు ఇచ్చాడు అమన్. ఈ కారును అమ్ముతున్నట్లు తెలిపి కొనేందుకు ఎవరైనా ఆసక్తిగా వుంటే కారును తీసుకువచ్చి చూపిస్తానని అయాన్ తెలిపాడు. ఇలా కారు అమ్మకానికి పెట్టడంతో అసలు కథ మొదలయ్యింది.  

అహ్మద్ ఎంతపని చేసాడు... 

అమ్మకానికి పెట్టిన లాంబోర్ఘిని కారు కొనేందుకు ఓ పార్టీ రెడీగా వుందని అయాన్ కు అమన్ తెలిపాడు. అయితే కారును ఓసారి చూడాలని అడుగుతున్నారని... వెంటనే హైదరాబాద్ శివారులోని మామిడిపల్లి సమీపంలో గల ఫార్మ్ హౌస్ కు రావాలని సూచించాడు. దీంతో నీరజ్ కు ఈ విషయాన్ని తెలపగా పని వుండటంతో నీరజ్ వెళ్లలేదు... అయాన్ కే కారును ఇచ్చి పంపించాడు. అతడి వద్దనుండి ఈ ఖరీదైన కారును తీసుకుని అమన్ మామిడిపల్లికి బయలుదేరాడు.  

అయితే అమన్ కారు తీసుకుని వెళుతుండగా జల్ పల్లి వద్ద కొందరు కార్లు, బైక్స్ పై వచ్చి ఆపారు. ఈ కారు ఓనర్ నీరజ్ తమకు రెండు కోట్లు ఇవ్వాలని... అతడు ఎక్కడున్నాడు అంటూ అమన్ ను నిలదీసారు. తనకు ఈ విషయాలేవీ తెలియవని... కేవలం కారు కొంటానంటే చూపించడానికి వెళుతున్నట్లు తెలిపాడు. కావాలంటే నీరజ్, అయాన్ లను పిలిపిస్తానని బ్రతిమాలుకున్నాడు. అయినాకూడా వినిపించుకోకుండా కోట్ల విలువచేసే కారుపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. 

వెంటనే అమన్ డయల్ 100 కు ఫోన్ చేయగా పోలీసులు ఫైరింజన్ ను తీసుకుని అక్కడికి చేరుకున్నారు. కానీ అప్పటికే కారు పూర్తిగా దగ్దమయ్యింది. అమన్ నుండి వివరాలను సేకరించిన పహాడి షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖరీదైన లంబోర్ఘిని కారుకు నిప్పంటించింది అహ్మద్, అతడి స్నేహితులుగా పోలీసులు గుర్తించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి లాంబోర్ఘిని కారు తగలబడుతున్న వీడియో

click me!