Praja Palana Application: ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారెంటీల కోసం కాంగ్రెస్ పార్టీ ‘అభయహస్తం’ పథకం కింద దరఖాస్తులు స్వీకరించిన వేళ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ ఘటనేంటీ?
Praja Palana Application:తెలంగాణలో రేవంత్ సర్కార్ చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం ఓ జాతరలా సాగింది. ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారెంటీల కోసం కాంగ్రెస్ పార్టీ ‘అభయహస్తం’ పథకం కింద దరఖాస్తులు స్వీకరించి విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా కోటీ 24 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
ఇదిలా ఉండగా.. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఈ దరఖాస్తుల్లో ఏకంగా ‘శివయ్య’ (దేవుడు)పేరుతో వచ్చిన ఓ దరఖాస్తు అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో అర్జీదారు ‘శివయ్య’ (దేవుడు) కాగా.. భార్య పేరు పార్వతీ దేవి, కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడిగా దరఖాస్తులో నింప బడ్డాయి. ప్రస్తుతం ఈ దరఖాస్తు ఫారం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఇంతకీ ఆ దరఖాస్తు ఎవరు పెట్టారనీ ఆరా తీస్తే.. అసలు విషయం బయటపడింది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన సామాన్యుడు ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి ‘శివుడి’ పేరుతో ఈ దరఖాస్తు పెట్టారంట. గ్రామంలోని త్రికూటేశ్వర ఆలయానికి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 12వ శతాబ్దంలో నిర్మించినదిగా భావిస్తున్న అతి పురాతన, అరుదైన, అద్భుతమైన ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోకుండా పోయింది.
ఆరు గ్యారెంటీల పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్న వేళ ఆయనకు ఓ ఆలోచన వచ్చిందట. అనుకున్నదే తడవుగా దేవుడి పేరుతో దరఖాస్తు సమర్పించారు. వివరాల్లో దేవుడి పేర్లనే రాశారు. శివుడి ఫోటోనే అతికించాడు. ఆలయంలో పూజలు జరగడం లేదనీ, ఓ పురోహితుడ్ని నియమించాలని, అలాగే ఆలయానికి ఓ గది కోసం ‘ఇందిరమ్మ ఇల్లు’ కావాల్సిందిగా దరఖాస్తు చేశానని సురేందర్ రెడ్డి తెలిపారు.