లోక్ సభ ఎన్నికలు.. తెలంగాణలో ప్రధాన పార్టీలకు ఉన్న బలాలేంటి.. ? బలహీనతలేంటి ?

By Sairam Indur  |  First Published Mar 27, 2024, 1:48 PM IST

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ ఉంటే అవకాశం ఉంది. అందులో ఒకటి అధికార కాంగ్రెస్ కాగా.. మరొకటి ప్రతిపక్ష బీఆర్ఎస్. ఇంకోటి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. అయితే ఈ మూడు పార్టీలకు తెలంగాణలో ఉన్న సానుకూల అంశాలు ఏంటి ? ప్రతికూల అంశాలు ఏంటి అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.


పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కేంద్రంలో తమ భవితవ్యాన్ని నిర్ణయించే తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలను గెలుచుకునేందుకు ప్రాంతీయ, జాతీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు  కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లకు ప్రస్తుతం ఉన్న బలాలు, బలహీనతలు, అవకాశాలు, ఆందోళనకరమైన విషయాలను ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ విశ్లేషించింది. ఆ మీడియా సంస్థ కథనం ప్రకారం.. 

కాంగ్రెస్

Latest Videos


బలాలేంటి ? 
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్లు, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల వల్ల మహిళల ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మొదటి 100 రోజుల్లోనే ఆరు హామీల్లో ఐదింటిని అమలు చేయడం కలిసి వచ్చే అంశం.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమైన సమస్యగా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేయడం, పోస్టింగ్ లు ఇవ్వడం వల్ల నిరుద్యోగులు కాస్త సంతృప్తిగా ఉన్నారు. 

తెలంగాణలో అధికార పార్టీ గా ఉండటం కలిసి వచ్చే అంశం. 

కేబినెట్ కేటాయింపుల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం, పోలీసు శాఖ, ఇతర విభాగాల్లో కీలక పదవుల్లో అవినీతి రహిత అధికారులను నియమించడం ప్రభుత్వంపై విశ్వసనీయతను పెంచింది.

ఎంఐఎంతో స్నేహం, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా పోటీ ఉండటంతో మైనారిటీ ఓట్లు ఆ పార్టీకి కలిసి రావొచ్చు.

రెడ్డి సామాజికవర్గం నుంచి పెరుగుతున్న మద్దతు, అలాగే దక్షిణ తెలంగాణ, ఖమ్మం, వరంగల్ లలో ఉనికిని బలోపేతం చేయడం కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ గా మారే అవకాశాలు ఉన్నాయి. 

బలహీనతలు

కేంద్రంలో బలమైన మోడీ ఇమేజ్ కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారనుంది.

ఇతర రాష్ట్రాల్లో బలహీనమైన పొత్తుల కారణంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలు, కొన్ని బీఆర్ఎస్ కంచుకోటల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కనబరిచింది.
ఎన్నికల లేటుగా ఉండటం వల్ల తాగునీటి సమస్యలు, విద్యుత్ సమస్యలు వంటి వేసవి సమస్యలు తీవ్రమవడం కాంగ్రెస్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

నిధుల కొరత కారణంగా హామీలన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్ కావచ్చు.

అవకాశాలు
మెజారిటీ పార్లమెంటు స్థానాలు గెలిస్తే వచ్చే ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని సుస్థిరం చేయవచ్చు.

రేవంత్ రెడ్డి నాయకత్వం పార్టీని ఇలాగే సుస్థిరంగా కొనసాగించగలుగుతుంది. ఆయన సీఎంగా కొనసాగడం వల్ల కాంగ్రెస్ తరచూ సీఎంలను మారుస్తుందనే నెగిటివ్ ఇమేజ్ ను పక్కన పడుతుంది.

నగరంతో పాటు ఉత్తర, మధ్య తెలంగాణలోనూ సాధించిన విజయాలు దీనికి జత అవగలవు.

తెలంగాణ నుంచి మళ్లీ దక్షిణ భారతదేశంలో పార్టీని బలోపేతం చేయడానికి అవకాశాలు ఉంటాయి. 

ఆందోళనలు


అనుకున్న సంఖ్యలో లోక్ సభ స్థానాలను సాధించడంలో విఫలమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపడవచ్చు

రేవంత్ రెడ్డిని గద్దె దించి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించవచ్చు.

 

బీజేపీ.. 

బలాలు

బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

గత లోక్ సభ ఎన్నికల పనితీరు ట్రాక్ రికార్డ్.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు వల్ల గులాభీ పార్టీతో బీజేపీకి పొత్తు లేదని ప్రజల్లోకి స్పష్టమైన సందేశం వెళ్లింది. 

అయోధ్యలో రామమందిర నిర్మాణం కలిసి వచ్చే అంశం.

అన్ని కులాల మధ్య సమ్మిళిత టికెట్ల పంపిణీ సామాజిక న్యాయ కోణాన్ని బలోపేతం చేసింది.

హైదరాబాద్, ఉత్తర తెలంగాణలో బలమైన ఉనికిని ఉండటం కలిసి రానుంది.

బలహీనతలు

ఇటీవల ఫిరాయింపుదారులకు సీట్లు కేటాయించడం అంతర్గత అసంతృప్తికి కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కాంగ్రెస్ అభ్యర్థులతో పోలిస్తే కొందరు అభ్యర్థులు బలహీనంగా ఉన్నారు.

రాష్ట్రంలో బలమైన ముఖం, రాష్ట్ర స్థాయి నాయకత్వం లేకపోవడం.

కొన్ని దక్షిణాది జిల్లాల్లో క్యాడర్, బూత్ స్థాయి కమిటీలు లేకపోవడం మైనస్ గా మారే అవకాశాలు ఉన్నాయి. 

అవకాశాలు

మెజారిటీ స్థానాలు గెలిస్తే 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలంగా నిలబడుతుంది.

కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం తలెత్తితే కీలక భాగస్వామి అయ్యే అవకాశం ఉంది.

పార్టీలో తెలంగాణ నేతలు కేంద్ర మంత్రి పదవులు చేపట్టవచ్చు.

ఆందోళనలు..


అధిక సీట్లు గెలుచుకోకపోతే. ఈ నష్టం వచ్చే ఐదేళ్ల పాటు పార్టీ జోష్ కు ఆటంకం కలిగించవచ్చు.

రాష్ట్రంలో ఆశించిన సీట్లు సాధించలేకపోతే కేంద్రంలో సంఖ్యాబలాన్ని ప్రభావితం చేస్తుంది. 

బీఆర్ఎస్ 

బలాలు


మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ముఖంగా కొనసాగడం పార్టీకి కలిసి వచ్చే అంశం.

అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో గణనీయమైన శాతం ఓటింగ్ నమోదైంది. ఇది పాజిటివ్ గా మారే అవకాశాలు ఉన్నాయి.

మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ వంటి నిర్దిష్ట ప్రాంతాల్లో బలమైన కోర్ ఓటు బ్యాంకు కలిసి రానుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మంచి వనరులు, ఆర్థిక స్థిరత్వం ఉండటం కూడా పాజిటివ్ విషయమే.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇమేజ్ కారణంగా పట్టణ ఓటర్లలో సానుకూల భావన నెలకొంది.

రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు వంటి పథకాలు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిధ్వనించడం కలిసి వచ్చే అంశం.

బలహీనతలు

జాతీయ స్థాయిలో పరిమిత రాజకీయ ఉనికి.

ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీల్లోకి ఫిరాయింపులు జరగడం.

కార్యకర్తలు, నాయకుల్లో మనోధైర్యం తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి ఇంకా కోలుకోలేదు. ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ కేసీఆర్ కుటుంబం ఆధిపత్యం, ఇంకా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడం నెగిటివ్ గా మారే అవకాశాలు ఉన్నాయి.

మహిళలు, మైనారిటీ ఓటర్ల మద్దతు తగ్గడం, గొర్రెల పంపిణీ, సాగునీటి ప్రాజెక్టులు వంటి కుంభకోణాలతో పరువు పోవడం కూడా వెనక్కి లాగవచ్చు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కూడా కాస్త నష్టం కలిగించవచ్చు.

అవకాశాలు

మెజారిటీ స్థానాలు గెలిస్తే.. క్యాడర్ నాయకత్వ స్థైర్యాన్ని పెంచుతుంది.

2028 అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన పునరాగమనం చేసే అవకాశం ఉంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ అస్థిరత ఏర్పడితే నాయకత్వం వహించే అవకాశాలు ఉంటాయి.

ఫిరాయింపులను నిరోధించవచ్చు. దీని వల్ల గణనీయమైన ఎన్నికల ప్రయోజనాలు కలుగుతాయి. 

ఆందోళనలు..

లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూస్తే పార్టీ అస్తిత్వానికి ముప్పు వాటిళ్లవచ్చు.

అంతర్గత చీలికలు, ఫిరాయింపుల ప్రమాదం ఉంటుంది.

కేంద్రం, రాష్ట్రంలో బలం లేకపోవడం వల్ల ఎక్కువ మంది నేతలు వివిధ ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. 
 

click me!