తప్పతాగి ఇతరుల ఇంట్లో చొరబడ్డ ఎస్సై... చెట్టుకుకట్టేసి చితకబాదిన స్థానికులు

By Arun Kumar PFirst Published Dec 1, 2022, 4:33 PM IST
Highlights

అర్ధరాత్రి మద్యమత్తులో తన ఇల్లు అనుకుని వేరే ఇంట్లోకి వెళ్లి తన్నులుతిన్నాడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతానికి చెందిన ఓ పోలీస్ అధికారి. చెట్టుకు కట్టేసి మరీ ఎస్సైని చితకబాదారు. 

జడ్చర్ల : బాధ్యతాయుతంగా వుండాల్సిన ఓ పోలీస్ అధికారి ఇళ్లూ, ఒళ్లు మరిచేలా తాగి ప్రజల చేతుల్లో తన్నులు తిన్నాడు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ ఎస్సైని స్థానికులు చెట్టుకుకట్టేసి మరీ చితకబాదిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో చోటుచేసుకుంది. అయితే ఈ విషయం బయటకు వస్తే డిపార్ట్ మెంట్ పరువు పోతుందని కింది స్థాయి పోలీసుల నుండి ఉన్నతాధికారుల వరకు గోప్యంగా వుంచడానికి ప్రయత్నిస్తున్నారు. 

ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్సై ఫుల్లుగా మద్యంసేవించి ఆ మత్తులోనే బుధవారం తెల్లవారుజామున ఇంటికి బయలుదేరాడు. అయితే ఎస్సై అద్దెకుండే ఇంటికి వెళ్లే మార్గంలో శుభకార్యం జరుగుతుండటంతో రోడ్డుకు అడ్డంగా టెంట్ వేసారు. దీంతో డ్రైవర్ మరో మార్గంలో ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ ఎస్సై ఇంటికి వెళ్లడం సాధ్యపడక దగ్గర్లో వాహనాన్ని నిలిపాడు డ్రైవర్. అప్పటికీ ఎస్సై మద్యంమత్తులోనే వుండటంతో వాహనాన్ని అక్కడే వదిలి డ్రైవర్ వెళ్లిపోయాడు. 

Read more  మూడు రోజుల క్రితం అదృశ్యమైన సురేష్: చిన్నశంకరంపేట కస్తూర్బా స్కూల్ వద్ద గుర్తింపు

కొద్దిసేపటి తర్వాత ఎస్సై వాహనంలోంచి దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ మద్యంమత్తులో అతడు ఎటు వెళుతున్నాడో తెలియలేదు. దీంతో తన ఇల్లు అనుకుని మరో ఇంటి తలుపుతట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసాడు. దీంతో కంగారుపడిపోయిన ఆ ఇంటివారు స్థానికుల సహకారంతో మద్యంమత్తులో వున్న ఎస్సైని పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. సివిల్ డ్రెస్ లో మాట్లాడలేని పరిస్థితిలో వుండటంతో అతడు పోలీస్ అని స్థానికులు గుర్తించలేకపోయారు. కొద్దిసేపటి తర్వాత అతడిని ఎస్సై గా గుర్తించిన స్థానికులు కట్లు విప్పేసారు. 

విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సెల్ ఫోన్లలో వీడియోలు, ఫోటోలను బలవంతంగా తొలగించారు. ఈ విషయం బయటపెట్టకూడదని చెప్పి ఎస్సైని తీసుకుని అక్కడినుండి వెళ్లిపోయారు. అయితే ఈ విషయం ఎలాగోలా మీడియా ప్రతినిధుల దృష్టికి వెళ్లగా అటు స్థానికులు గానీ, ఇటు ఎస్సై గానీ స్పందించడానికి ఇష్టపడలేదు. అయితే జడ్చర్లలో మాత్రం ఎస్సై వ్యవహారంపై జోరుగా ప్రచారం జరుగుతోంది. 

click me!