
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. విద్యా వ్యవస్థను మెరుగు పర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ఇవాళ సర్వశిక్షాభియాన్ స్టేట్ ప్రాజెక్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్ల వర్క్ షాపునకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నాలుగు నెలలు విద్యా రంగానికి చాలా ముఖ్యమైన కాలమని తెలిపారు.
మంచి ఫలితాలు వస్తేనే ప్రజల్లో విద్యపై నమ్మకం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీకాలేజీల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని చెప్పారు. 33 కాలేజీల్లో న్యాక్ గుర్తింపు లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లను సర్వీసు ప్రకారం క్రమబద్దీకరిస్తామని ప్రకటించారు.
ప్రతీ కాలేజీలో తెలంగాణ నాలెడ్జ్ స్కిల్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. నాలుగు నెలల్లో కాలేజీల్లో బయోమెట్రిక్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. వచ్చే నాలుగు, ఐదేళ్లలో తెలంగాణ విద్యాశాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందని
ఆశాభావం వ్యక్తం చేశారు.