రేవంత్ కు మంత్రి లక్ష్మారెడ్డి ఝలక్

First Published Jan 4, 2018, 7:16 PM IST
Highlights
  • లక్ష్మారెడ్డి హోమియో డాక్టర్
  • ఆయనపై తప్పుడు ప్రచారం తడదు
  • హోమియో డాక్టర్ మంత్రి కావడం అద్భుతం
  • మరోసారి నోరు జారితే చట్టపరమైన చర్యలు

తీవ్రమైన, రాయలేని భాషలో మంత్రి లక్ష్మారెడ్డిపై విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. ఆకాశమే హద్దుగా తిట్ల దండకం అందుకున్నారు. అయితే తాజాగా రేవంత్ కు లక్ష్మారెడ్డి గట్టి ఝలక్ ఇచ్చారు. లక్ష్మారెడ్డి దోస్తులు రంగంలోకి దిగారు. రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. మల్లా ఇంకోసారి రేవంత్ నోరుపారేసుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి చదువు మీద హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీ హోమియో పతిక్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్ రావు, ఆ కాలేజీ పూర్వ విద్యార్థులు క్లారిటీ ఇచ్చారు.

సంతప్ రావు మాటలు చదవండి...  వైద్యుడే వైద్యశాఖకు మంత్రిగా ఉండటం అత్యంత గొప్ప విషయం అన్నారు సంతప్ రావు. ఇప్పటి వరకు అలోపతి డాక్టర్లు వైద్య శాఖలను నిర్వహించారు. నిర్వహిస్తున్నారు. కానీ, దేశీయ వైద్యం ఆయుష్ విభాగానికి చెందిన డాక్టర్లు మంత్రులు కావడం కానీ, వైద్య శాఖలకు బాధ్యత వహించడం కానీ దేశంలో ఎక్కడా జరగలేదు. ఒక హోమియో డాక్టర్ మంత్రి అవడం దేశంలోనే తొలిసారి. భారత దేశ చరిత్రలో అదీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండటం విశేషం. తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమశాఖకు మంత్రిగా ఉన్న డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి మా కాలేజీ విద్యార్థి అవడం మాకు గర్వంగా ఉంది. నూతన రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో భాగస్వామి అయిన మా కాలేజీ విద్యార్థి లక్ష్మారెడ్డిని చూసి గర్వపడుతున్నాం. ఇది ఒక మా కాలేజీకే కాదు. హోమియో వైద్య వృత్తిలోని వాళ్ళకు మాత్రమే కాదు. మొత్తం వైద్య వృత్తికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా గర్వకారణమే.

వైద్య విద్యని అభ్యసిచండం ఒక ఎత్తు, వైద్య సేవలు అందించడం మరో ఎత్తు. అదీ వైద్య విద్య, వైద్య రంగాల అభివృద్ధికి పాటు పడే అరుదైన అవకాశం అత్యంత అరదుగా లభించేది. అలాంటి అద్భుత అవకాశం మా డాక్టర్ సి లక్ష్మారెడ్డికి దక్కడం సంతోషదాయకం. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. దిగ్విజయంగా వైద్యశాఖలో అనేక సంస్కరణలు తెస్తూ, ప్రభుత్వ దవాఖానాలను ఆధునీకరిస్తూ, ఓపీ, ఐపీలను పెంచుతూ, కెసిఆర్ కిట్ల వంటి పథకాలను అమలు చేస్తూ అందరి మన్ననలను పొందుతూ అవార్డులు, రివార్డులు తీసుకుంటుండటం మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి పని తీరుకి నిదర్శనం.

ఇలాంటి వ్యక్తి మీద ఈ మధ్య కాలంలో కొందరు అసత్య ఆరోపణలకు దిగుతున్నారు. అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. అనవసరంగా నోరు జారుతున్నారు. ఈ విషయాలు తెలిసి, కలత చెంది, వాస్తవాలను ప్రజలకు తెలపాలనే ఉద్దేశ్యంతో మేం మీడియా ముందుకు వచ్చాం. డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి 1980-81లో స్థాపించిన మా కాలేజీ హైదరాబాద్ కర్ణాటక ఎండ్యుకేషనల్ సొసైటీ  (HKES) హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో1987లో ఉత్తీర్ణులయ్యారు. లక్ష్మారెడ్డిగారు మొదటి బ్యాచ్ విద్యార్థి. ఆతర్వాత కర్ణాటక హోమియోపతిక్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మా కాలేజీని 1985లోనే భారత ప్రభుత్వం గుర్తించి సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతిక్ 2వ చాప్టర్లో చేర్చి నోటిఫై కూడా చేసింది. ఈ కాలేజిని అప్పటి కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ప్రస్తుత కర్ణాటక రాష్ట్రం రాయ గిర్ ఎమ్మెల్యే డాక్టర్ ఎబి మాలకారెడ్డి ఏర్పాటు చేశారు. ఆయన అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా దేశ వ్యాప్తంగా మా కాలేజీ నుంచి వేలాది మంది విద్యార్థులు చదివి ఉన్నారు. చదువుతున్నారు.

కొందరు రాజకీయ లబ్ధి కోసం ఒకప్పటి మా కాలేజీ విద్యార్థి అయిన మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి పై చేసిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నాం. మా కాలేజీ విద్యార్థి అయిన మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డిని అవమానించడం మమ్మల్ని, మా కాలేజీని అవమానించడంగా భావిస్తున్నాం. అలాగే వైద్య వృత్తిని అవమానించడమే. ఈ అంశం మీద ఒక క్లారిటీని ఇచ్చాం. ఇంతటితో ఈ ఇష్యూని ముగించాలని విజ్ఞులకు విజ్ఞప్తి చేస్తున్నాం. తదుపరి కూడా ఇలాంటివి కొనసాగితే తప్పకుండా చట్ట రీత్యా చర్యలకు దిగుతాం. వారి స్వ ప్రయోజనాల కోసం మమ్మల్ని, మా కాలేజీని, మా కాలేజీ విద్యార్థులపై బురద చల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదు.

click me!