టీఆర్ఎస్ లో హరీష్ రావు ఇష్యూ: లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

By pratap reddyFirst Published Sep 25, 2018, 10:47 AM IST
Highlights

ఒకవేళ కోదండరామ్ కూటమిలో చేరితే ఉద్యమ నాయకుడి విలువ, గౌరవం పోతుందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మహాకూటమితో అంటకాగితే, తెలంగాణ ప్రజలు క్షమించరని అన్నారు. 

హైదరాబాద్‌: తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్ రావు వ్యవహారంపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నిట్టనిలువునా చీలుతుందని, ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని ఆయన వ్యాఖ్యానించారు. 

హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్సనమని ఆయన అభిప్రాయపడ్డారు. హరీశ్‌ వ్యాఖ్యలు టీఆర్‌ఎస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని, పార్టీలో చీలికలు రావడం తప్పదని అన్నారు. మంత్రి కేటీఆర్‌ తన స్థాయిని మించి ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. 

గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి, రవీందర్‌రెడ్డి తమ మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సోమవారంనాడు లక్ష్మణ్ మాట్లాడారు. అరవై ఏళ్లు తలకిందులుగా తపస్సు చేసినా కాంగ్రెస్‌ అధికారంలోకి రాదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీడీపిని దోషిగా నిలబడిందని, అటువంటి టీడీపీ ఉన్న మహా కూటమిలో కోదండరాం చేరుతారని అనుకోవడం లేదని అన్నారు. 

ఒకవేళ కోదండరామ్ కూటమిలో చేరితే ఉద్యమ నాయకుడి విలువ, గౌరవం పోతుందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మహాకూటమితో అంటకాగితే, తెలంగాణ ప్రజలు క్షమించరని అన్నారు. 

వినాయక నిమజ్జనం సందర్భంగా విగ్రహాలను ట్రాక్టర్లు, లారీల్లో తీసుకొస్తున్న డ్రైవర్లకు బ్రీత్‌ అనలైజర్‌ పెట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. అందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రగతి నివేదన సభకు వచ్చిన వాహనాల డ్రైవర్లకు ఇలాగే బ్రీత్‌ అనలైజర్లను పెట్టారా అని లక్ష్మణ్ ప్రశ్నించారు.

click me!