వైద్య నిర్లక్ష్యానికి గురైన వ్యక్తికి సాయం: బహుమతినే విరాళంగా ఇచ్చాడు

By Siva KodatiFirst Published Jun 26, 2019, 8:59 PM IST
Highlights

అనారోగ్యంతో బాధపడుతున్న యోగా కోచ్‌కి తాను బహుమతిగా పొందిన మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడో సామాజిక కార్యకర్త

అనారోగ్యంతో బాధపడుతున్న యోగా కోచ్‌కి తాను బహుమతిగా పొందిన మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడో సామాజిక కార్యకర్త.

వివరాల్లోకి వెళితే.. ఉస్మానియా న్యాయవాద విద్యను చదువుతున్న ఆకాశ్ కుమార్.. సుల్తాన్ బజార్‌లోని హేమంత్ శారీ స్టోర్‌.. ప్రముఖ వ్యక్తుల ఫోటోలను, పేర్లను వారి అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా మోసం చేస్తుండటంపై మే 15న వినియోగదారుల విభాగానికి ఫిర్యాదు చేశాడు.

దీనిపై స్పందించిన సలహా కేంద్రం నిర్వాహకులు ప్రముఖ వ్యక్తులు, హీరో, హీరోయిన్ల ఫోటో అనుమతి లేకుండా వాడుకోవడంపై నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫోటో వాడుకున్నందుకు గాను రూ.7 వేల రూపాయలు జరిమానా విధించింది.

ఈ మొత్తాన్ని జూన్ 22న వినియోగదారుల సలహా కేంద్రం ఆకాశ్‌కే బహుమతిగా అందజేసింది. అయితే దేవయ్య అనే వ్యక్తి అంతర్జాతీయ యోగాలో పథకం సాధించాడు.. గతంలో నేషనల్ పోలీస్ అకాడమీలో యోగా కోచ్‌గా పనిచేశారు.

ఈ క్రమంలో దేవయ్యకు ఫిస్ట్యూలా వ్యాధి సోకడంతో సికింద్రాబాద్‌లోని లేజర్ పైల్స్ క్లినిక్‌లో వైద్యం చేయించుకున్నారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వ్యాధి ముదిరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఇప్పటి వరకు ఆయన వైద్యానికి దాదాపు రూ.30 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినప్పటికీ వ్యాధి నయం కాలేదు...ఉన్నదంతా వైద్యానికి ఖర్చు కావడంతో తదుపరి చికిత్స చేయించలేక దేవయ్య మంచానికే పరిమితమయ్యారు.

ఈ విషయం ఆకాశ్‌ కు తెలియడంతో ఆయన తనకు వినియోగదారుల కేంద్రం నుంచి అందిన నజరానా రూ. 7 వేలకు మరో నాలుగు వేలు కలిపి దేవయ్యకు సాయం చేశాడు. ఈ మొత్తాన్ని బుధవారం పౌరసరఫరాల కార్యదర్శి అకున్ సబర్వాల్ చేతుల మీదుగా దేవయ్యకు అందజేశాడు.

స్వయంగా పేద కుటుంబం నుంచి వచ్చిన ఆకాశ్ తనకు వచ్చిన బహుమతిని మరో మనిషికి ఇవ్వడం చాలా అభినందనీయమని ప్రశంసించారు. వినియోగదారులకు తమ హక్కులపై మరింత అవగాహన కల్పించాలని.. అందరూ కూడా ఆకాశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని అకున్ సూచించారు. 

click me!