స్వరూపానందకు పుష్పాభిషేకం చేసిన కేసీఆర్

By Siva KodatiFirst Published Jun 26, 2019, 6:16 PM IST
Highlights

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి, ఉత్తరాధికారిగా నియమితులైన స్వాత్మానందేంద్ర సరస్వతిలకు కేసీఆర్ పుష్పాభిషేకం చేశారు. 

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి, ఉత్తరాధికారిగా నియమితులైన స్వాత్మానందేంద్ర సరస్వతిలకు కేసీఆర్ పుష్పాభిషేకం చేశారు.

హైదరాబాద్ జలవిహార్‌లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్‌తో పాటు మంత్రులు, స్పీకర్ పోచారం, అధికారులు పాల్గొన్నారు. కోకాపేటలో శారదా పీఠానికి రెండెకరాల భూమిని కేటాయించిన పత్రాలను కేసీఆర్ ఆ సందర్భంగా స్వరూపానందేంద్రకు అందజేశారు. 

ఇటీవల శారదా పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమం విజయవాడలో నిర్వహించగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యారు. ఆ సమయంలో స్వాములకు పుష్పాభిషేకం నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.  

విశాఖ శారదా పీఠం ఒక తపో పీఠమన్నారు స్వరూపానంద స్వామిజీ. దేశంలో ఎన్నో పీఠాలు, ఉప పీఠాలు ఉన్నా.. హిమాలయాల నుంచి గంగా ప్రవహంలా పుట్టుకొచ్చిన పీఠం శారదా పీఠమన్నారు.

తమ పీఠానికి తపస్సే పరమావధనన్నారు... శంకరాచార్యుల వారు ప్రభోదించిన విధంగా సకల ప్రాణులలో ఉన్న ఆత్మ ఒక్కటేనన్నారు. శంకరాచార్యల వారు 2000 ఏళ్ల క్రితమే దేశంలో ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకువచ్చారని స్వరూపానంద గుర్తు చేశారు.

విశాఖ శారదా పీఠాన్ని కేసీఆర్ ఇంతలా గౌరవించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. పీఠాలు, మఠాలు గౌరవించే సంస్కృతి మన సమాజంలో నానాటికీ తగ్గిపోతుందని స్వరూపానంద ఆవేదన వ్యక్తం చేశారు.

మానసిక వ్యాధులు పొగొట్టే ఆరోగ్య కేంద్రాలు పీఠాలు, మఠాలని అటువంటి పీఠాలను దేశం కాపాడుకోవాలని స్వరూపానంద స్పష్టం చేశారు. విశాఖ శారదా పీఠం ఏనాడు ఆస్తులు, కీర్తిప్రతిష్టల కోసం పోరాడలేదని 25 సంవత్సరాలుగా ధర్మం కోసం పోరాడిన ఏకైక పీఠమన్నారు. 

పుష్ఫాభిషేకం జరగడం పట్ల తనకు చాలా సంతోషంగా ఉందన్నారు విశాఖ శారద పీఠాధిపతి స్వాత్మానందేంద్ర. పుష్పాభిషేకం సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పవిత్ర కృష్ణానది తీరంలో తాను గురువుగారి ఆశీస్సులతో సన్యాసాశ్రమం స్వీకరించానని తెలిపారు.

గురువుల ఆదేశానుసారం ఆదిశంకరుల అద్వైతాన్ని తెలుగునాటే కాకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తానని స్వామిజీ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచే తాను రుషీకేశ్‌కు బయలుదేరుతున్నట్లు స్వాత్మానందేంద్ర తెలిపారు. 

click me!