లాఠీ డెడ్లీ వెపన్ కాదు, చంపాలనే ఉద్దేశ్యం లేకుంటే కర్రల దాడిలో మరణిస్తే అది హత్యానేరం కాదు: తెలంగాణ హైకోర్టు

By Mahesh K  |  First Published Sep 14, 2023, 4:13 PM IST

లాఠీ, కర్రలు ప్రాణాంతక ఆయుధాలేమీ కావని తెలంగాణ హైకోర్టు తెలిపింది. చంపే ఉద్దేశ్యం లేకుండా కర్రలతో దాడి చేసిన ఘటనలో అందులో వ్యక్తి మరణిస్తే.. దాన్ని హత్యానేరంగా చూడలేమని వివరించింది.
 


హైదరాబాద్: చంపాలనే ఉద్దేశ్యం లేకుండా లాఠీతో లేదా కర్రలతో జరిగిన దాడిలో ఒక వ్యక్తి మరణిస్తే.. దాన్ని హత్యా నేరంగా పరిగణించలేమని తెలంగాణ హైకోర్టు తెలిపింది. అది నిందార్హమైనదే, కానీ, మర్డర్‌గా చెప్పలేమని వివరించింది. న్యాయమూర్తులు కే లక్ష్మణ్, కే సృజనల డివిజన్ బెంచ్ ఈ రూలింగ్ ఇటీవలే ఇచ్చింది. ఐపీసీలోని 302 (హత్య), 304-II(కల్పేబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్‌ టు మర్డర్) సెక్షన్లలో శిక్ష అనుభవిస్తున్నవారిని నిర్దోషులుగా ప్రకటించింది.

‘నిందితులు బాధితుడిని  కర్రలతో కొట్టారు. ఆ కర్రలు గ్రామాల్లో సాధారణంగా వాడేవే. వాటిని ప్రాణాంతక ఆయుధాలుగా పేర్కొనలేం. శ్రీశైలానికి విట్టల్ బాకీ పడ్డ రుణం గురించి తప్పితే వారి మధ్య తీవ్రమైన గొడవలేమీ లేవు. కర్రలతో కొట్టడంతో బాధితుడు మరణించాడు. కాబట్టి, వాళ్లు ముందస్తుగానే బాధితుడిని చంపాలనే ప్రణాళికలేమీ వేసుకోలేదు. చంపాలనే ఉద్దేశ్యమూ వారికి లేదు’ అని డివిజన్ బెంచ్ వివరించింది.

Latest Videos

ఫిర్యాదుదారుడి ప్రకారం, వ్యవసాయ రుణానికి సంబంధించిన పేమెంట్ విషయంలో తనకు, మరణించిన వ్యక్తికి, అలాగే నిందితులకు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తనపై, మరణించిన వ్యక్తిపై నిందితులు దాడి చేశారు. ఆ చిన్న ఘర్షణ, హింసాత్మక దాడిగా మారిపోయింది. ఈ దాడిలో మరణించిన వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. ఆయన స్పాట్‌లోనే మరణించాడు.

Also Read: Quad Summit: జీ20 తర్వాత క్వాడ్ సదస్సు.. భారత్‌లోనే నిర్వహించనున్న ప్రధాని మోడీ!

నిందితులు అందరూ మరణించిన వ్యక్తికి బంధువులేనని, వారి మధ్య ఒక చిన్న గొడవ మాత్రమే ఉన్నదని కోర్టు గుర్తించింది.

ఆయన మరణించాడు.. కానీ, ఆయనపై దాడికి ఉపయోగించిన కర్రలు ప్రాణాంతకమైనవి కావని కోర్టు తెలిపింది. ఆ దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని, బాధితుడిని చంపాలనే ఉద్దేశ్యం నిందితుల్లో ఉన్నట్టు చెప్పే ఆధారాలేవీ లేవని కోర్టు తెలిపింది. కాబట్టి, నిందితులపై నేరం హత్యానేరం కాకుండా.. సెక్షన్ 304 రెండో పార్టులోకి వస్తుందని వివరించింది.

కాబట్టి, చంపే తీవ్రతతో ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేసినట్టు ఈ ఘటనను చెప్పలేమని కోర్టు తెలిపింది. దాడి చేసి చంపేయాలనే ఉద్దేశ్యం వారికి లేదని, కాబట్టి, దీన్ని మర్డర్‌గా కాకుండా నిందార్హమైన నేరంగా చూడాలని కోర్టు వివరించింది.

అందుకే ఆ అప్పీల్‌ను పాక్షికంగా స్వీకరిస్తున్నట్టు పేర్కొన్న ధర్మాసనం వారికి పడిన శిక్షను తగ్గించింది.

click me!