లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

By pratap reddyFirst Published Dec 4, 2018, 9:40 PM IST
Highlights

లగడపాటి వెల్లడించిన విషయాలను బట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి నల్లేరు మీద నడక కాదనేది అర్థం చేసుకోవచ్చు. ఏయే జిల్లాల్లో ఎలా ఫలితాలు రావచ్చుననే విషయాన్ని ఆయన చెప్పారు. 

హైదరాబాద్: ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చెప్పినట్లుగా గెలిచే అవకాశాలున్న మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లను బయటపెట్టారు. ఆయన మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ ముగ్గురి పేర్లు చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ శానససభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే సంకేతాలను కూడా ఇచ్చారు. 

లగడపాటి వెల్లడించిన విషయాలను బట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి నల్లేరు మీద నడక కాదనేది అర్థం చేసుకోవచ్చు. ఏయే జిల్లాల్లో ఎలా ఫలితాలు రావచ్చుననే విషయాన్ని ఆయన చెప్పారు. 

ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెసు ఆధిక్యంలో ఉంటుందని ఆయన చెప్పారు. ఈ నాలుగు జిల్లాల్లోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలున్నాయి. ఉమ్మడి జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని లగడపాటి సర్వే సాగింది. 

మెదక్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో టీఆర్ఎస్ కు అధిక సీట్లు వస్తాయని ఆయన అంచనా వేశారు. పై నాలుగు జిల్లాల్లో నష్టపోయే సీట్లను టీఆర్ఎస్ ఈ జిల్లాల్లో భర్తీ చేసుకుంటుందా అనేది అనుమానమే. అత్యధికంగా అసెంబ్లీ సీట్లున్న ఆ నాలుగు జిల్లాల్లో టీఆర్ఎస్ తక్కువ స్థానాలను గెలుచుకుంటే తక్కువ స్థానాలు ఉన్న మూడు జిల్లాల్లో ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఎలా ఉంటుందనేది అంచనా వేసుకోవచ్చు.  

కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో టీఆర్ఎస్, కాంగ్రెసు మధ్య పోటాపోటీ ఉంటుందని లగడపాటి చెప్పారు. ఈ రెండు జిల్లాల్లో సమానమైన సీట్లు వచ్చినా టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వస్తుందని చెప్పలేం. కరీంనగర్ టీఆర్ఎస్ కు బలమైన జిల్లా. ఒకవేళ కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు వస్తే కాంగ్రెసుతో సమానమైన సీట్లను సాధించే అవకాశాలు లేకపోలేదని చెప్పవచ్చు. 

హైదరాబాద్ జిల్లాలో మజ్లీస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని లగడపాటి అంచనా. హైదరాబాదులో 15 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో 7 సీట్లు మజ్లీస్ కు వదిలేస్తే 8 సీట్లను అన్ని పార్టీలు పంచుకుంటాయి. బిజెపి, టీఆర్ఎస్, కాంగ్రెసు పంచుకునే అవకాశం ఉంది. బిజెపికి సీట్లు పెరగవచ్చునని కూడా ఆయన అన్నారు. జిల్లాల్లో కూడా ఆ పార్టీకి సీట్లు రావచ్చునని అంచనా వేశారు. బిజెపికి ఆరు నుంచి 8 సీట్లు వచ్చే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

మరోవైపు, లగడపాటి గెలుస్తారని చెప్పిన ఐదుగురు స్వతంత్రులు కూడా కాంగ్రెసుకు సన్నిహితులు. బోథ్ నుంచి అనిల్ కుమార్ జాదవ్, నారాయణ పేట్ నుంచి శివకుమార్ రెడ్డి గెలుస్తారని ఇది వరకే చెప్పిన ఆయన మరో ముగ్గురు పేర్లు వెల్లడించారు. వారిద్దరు కాంగ్రెసు రెబెల్స్ అని చెప్పవచ్చు. 

మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ గెలుస్తారని ఆయన చెప్పారు. ఏ పార్టీ టికెట్ పై గెలిచినా మల్ రెడ్డి రంగారెడ్డి, జలంధర్ రెడ్డి కాంగ్రెసుకు చెందినవారే. గడ్డం వినోద్ టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. అయితే, ఆయన ఎన్నికల పరిణామాల నేపథ్యంలో కాంగ్రెసు వైపు మొగ్గు చూపవచ్చు. 

టీఆర్ఎస్ మజ్లీస్, బిజెపిల సహాయంతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందా, ఈ రెండు పార్టీలు ఒక్క ఒరలో ఒదుగుతాయా అనేది చూడాల్సి ఉంది. లేదంటే, కాంగ్రెసు అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన మంత్రాంగాలు నెరిపే అవకాశాలు లేకపోలేదు. అయితే, తెలంగాణలో హంగ్ రాదని లగడపాటి అంచనా వేశారు. ఆయన సర్వే ఫలితాలను పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ నెల 7వ తేదీ సాయంత్రం వరకు ఆగక తప్పదు. 

ఫలితాలు కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ చెప్పినట్లు ఏకపక్షంగా ఉండవని లగడపాటి సర్వే ద్వారా సంకేతాలు ఇచ్చారు. అందుకే ఆయనపై కేసీఆర్, కేటీఆర్ మండిపడుతున్నారు. ఒక వేళ సర్వే ఫలితాలు వాస్తవ ఫలితాలకు సమీపంగా లేకపోతే లగడపాటి తన విశ్వసనీయతను కోల్పోక తప్పదు. మిగతా విషయాల మాట ఎలా ఉన్నా సర్వేల విషయంలో తన విశ్వసనీయతను బలి పెడుతారని అనుకోవడానికి లేదు. 

లగడపాటి అంచనాల ప్రకారం ప్రజా కూటమి 46 సీట్లలో, టీఆర్ఎస్ 31 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి. 27 చోట్ల పోటాపోటీ ఉంటుంది. మజ్లీస్ కు 7 స్తానాలు వస్తాయి. హైదరాబాదులో మరో 8 సీట్లు ప్రజా కూటమికి వచ్చే అవకాశాలున్నాయి. మిగతా సీట్లు టీఆర్ఎస్, బిజెపి పంచుకుంటాయి. 

లగడపాటి చిన్న మెలిక కూడా పెట్టారు. ఎన్నికల్లో 68.5 శాతం కన్నా ఎక్కువ పోలింగ్ నమోదైతే అంచనాలు తారుమారవుతాయని, పోలింగ్ అంతకన్నా తగ్గితే హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. 

click me!