
హైదరాబాద్: ట్విట్టర్ వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత, తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటి రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెసుపై గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ట్విట్టర్ లో పోస్టు చేసి నిలదీశారు.
గతంలో కాంగ్రెస్‌ను విమర్శిస్తూ చంద్రబాబు చేసిన ట్వీట్లనే రీట్వీట్ చేస్తూ కేటిఆర్ విమర్శలు చేశారు. "అవినీతి కాంగ్రెస్ విముక్త భారతమే మన లక్ష్యం. అది సాధించడానికి ఏం చేయాలో అది చేద్దాం... మన నిస్వార్థ కూటమి గురించి చరిత్రే చెబుతుంది" అంటూ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. "ఫేమస్ లాస్ట్ వర్డ్స్" అని సెటైర్ వేశారు.
"చంద్రబాబు గారి నుంచి వచ్చిన మరో ఆణిముత్యం" అని ట్వీట్ చేస్తూ "రాహుల్, సోనియా గాంధీలు తెలంగాణపై కొత్తగా ఒలకబోస్తున్న ప్రేమ దుర్మార్గమైనది. తెలంగాణకు చివరిసారిగా వాళ్లు వచ్చింది ఎప్పుడు.. అభివృద్ధి కోసం వాళ్లు చేసిందేమిటి" అని 2014 ఏప్రిల్ 26న చంద్రబాబు చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.
"2014 వరకు స్కాంగ్రెస్ నేతలు రాహుల్, సోనియా తెలంగాణ కోసం ఏమీ చేయకపోతే.. ఇంతలో వచ్చిన మార్పు ఏమిటి?" అని చంద్రబాబును ప్రశ్నించారు.
"అన్ని జిల్లాల్లో ప్రజాగర్జన సభలు ముగిసే నాటికి కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతమవుతుంది. ఇటాలియన్ మాఫియా రాజ్‌కు ముగింపిది. ఇదే నా జోస్యం" అని 2014 ఫిబ్రవరి 15న చంద్రబాబు మరో ట్వీట్ చేశారు. దాన్ని ప్రస్తావిస్తూ.. "అందుకే కదా దీన్ని నేను మహా చెత్త కూటమి అంటున్నా" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.